చంద్రబాబు కలల ప్రాజెక్టు.. రేవంత్ ఫ్యూచర్ ప్లాన్.. కేంద్రం ఓకే?
తాజా విజయంతో వారి బంధం సుస్థిరమవ్వనుందని అంటున్నారు. ఇంతకీ గురుశిష్యులుగా ప్రతిపక్షాలు ప్రచారం చేసే చంద్రబాబు.. రేవంత్ రెడ్డి ఏం సాధించారన్న విషయానికి ఇప్పుడు వద్దాం..
By: Tupaki Desk | 22 July 2025 11:38 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ భారీ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఉమ్మడిగా కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టును సాధించారని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలపై అనేక ప్రచారాలు ఉన్నాయి. తాజా విజయంతో వారి బంధం సుస్థిరమవ్వనుందని అంటున్నారు. ఇంతకీ గురుశిష్యులుగా ప్రతిపక్షాలు ప్రచారం చేసే చంద్రబాబు.. రేవంత్ రెడ్డి ఏం సాధించారన్న విషయానికి ఇప్పుడు వద్దాం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనతో తన ముద్ర వేసేందుకు ఫ్యూచర్ సిటీని ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. జంట నగరాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్, సికింద్రాబాద్ ఆ తర్వాత సైబరాబాద్ నిర్మాణంతో విశ్వనగరంగా ఎదిగింది. ఇక నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఒడిఒడి అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టు రాజధాని అమరావతి. విశ్వనగరంగా నిర్మిస్తున్న అమరావతికి మిగిలిన ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు. రోడ్డు, రైలు, వాయు మార్గాలపై ఇప్పటికే ప్రతిపాదనలు అనుమతులు సాధిస్తున్నారు.
అయితే ఇప్పుడు కనెక్టివిటీని మరింత సౌలభ్యంగా తీర్చిదిద్దేందుకు గాను అమరావతికి హైస్పీడ్ రైలు కారిడార్ వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి హైస్పీడు రైలు మార్గం వేయాలని నిర్ణయించి కేంద్రం అనుమతి కూడా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన సమయంలోనే అమరావతికి రైల్వేలైనుపై హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ హామీని హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ఉపయోగించుకోవాలని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తాజాగా వెల్లడైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వణీ వైష్ణవ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఈ ప్రస్తావన వచ్చిందని, దీనిపై సానుకూల స్పందన వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీ - అమరావతిని కలిపే ఎక్స్‌ప్రెస్ వే రూట్ మ్యాప్ ఖరారుకు ఓ కంపెనీకి బాధ్యతలు అప్పగించారని కూడా తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాల ఆర్థిక వృద్ధి మరింత వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
