Begin typing your search above and press return to search.

పెట్రోల్ లీట‌రు రూ.331, డీజిల్ లీట‌ర్ రూ.329.. ఎక్క‌డంటే!

లీట‌రు డీజిల్ ఇప్పుడు పాకిస్థాన్‌లో రూ.329.18 పైస‌లకు చేరింది. దీంతో ప్ర‌జ‌లు అల్లాడి పోతున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 11:01 AM GMT
పెట్రోల్ లీట‌రు రూ.331, డీజిల్ లీట‌ర్ రూ.329.. ఎక్క‌డంటే!
X

మ‌న దాయాది దేశం పాకిస్థాన్ ద్ర‌వ్యోల్బ‌ణంతో అత‌లాకుత‌లం అవుతోంది. రూపాయి వ‌చ్చే మార్గం లేక‌, ఉన్న వాటిపైనే ధ‌ర‌లు పెంచి.. ప్ర‌జ‌ల‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా అక్క‌డ లీటరు పెట్రోల్ ధ‌ర రూ.331.38 పైస‌లకు పెరిగిపోయింది. ఇక‌, లీట‌రు డీజిల్ ధ‌ర కూడా దీనికి దాదాపు స‌మానంగానే ఉంది. లీట‌రు డీజిల్ ఇప్పుడు పాకిస్థాన్‌లో రూ.329.18 పైస‌లకు చేరింది. దీంతో ప్ర‌జ‌లు అల్లాడి పోతున్నారు.

నిజానికి ఇంధ‌న ధ‌ర‌లు పెరిగితే.. దీనికి ముడిప‌డిన ర‌వాణా రంగం ధ‌ర‌లు కూడా భారీగా పెరుగుతాయి. ఇప్పుడు పాకిస్థాన్‌లోనూ అదే జ‌రుగుతోంది. తాజాగా పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.26.2 పైసలు, డీజిల్ ధ‌ర‌ను రూ.17.34 పైసలు పెంచింది. దీంతో ఏకంగా పెట్రోల్ ధ‌ర రూ.331.38, డీజిల్ ధ‌ర రూ.329.18 పైస‌ల‌కు చేరింది. ఈ ప్ర‌భావంతో ప్రజలు మరింత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

అయితే, పేద వ‌ర్గానికి చెందిన‌ ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, పెరుగుతున్న ద్ర‌వ్యోల్బణాన్ని అదుపు చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న స‌ర్కారు ఏ విధంగా ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటుందని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఇదిలావుంటే, ర‌వాణా రంగంతో ముడిప‌డిన నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు, ప్ర‌జా ర‌వాణా స‌హా.. అన్ని ధ‌ర‌లు కూడా భారీ ఎత్తున పెరిగిపోయాయి. దీంతో సాధార‌ణ ప్ర‌జ‌ల జీవ‌నం దుర్భ‌రంగా మారిపోయింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

అస్థిర ప్ర‌భుత్వంతో అత‌లాకుత‌లం అవుతున్న పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌కు ఈ ఆటుపోట్లు కొత్త కాక‌పోయినా.. ప్ర‌స్తుతం తార‌జువ్వ‌లా ఆకాశానికి ఎగ‌బాకిన ద్ర‌వ్యోల్బ‌ణం వారి జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. పాకిస్థాన్ కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చిన్నచిన్న వస్తువులను సైతం ఖరీదైపోయాయి. ఈఎంఎఫ్, బెయిలౌట్ ఫండ్ నుండి కొంత ఉపశమనం లభించినప్పటికీ ద్రవ్యోల్బణంలో తేడా ఏమీ లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం క‌నిపిస్తోంది.