శవానికీ తప్పని ‘క్యూ’ తిప్పలు! పెట్రోల్ కొరతతో అమానవీయ దృశ్యాలు!
శవం శివంతో సమానం అని మనం చెప్తుంటాం.. అలాంటి శవానికే అవమానం జరిగితే.. సరిగ్గా ఇలాంటి ఘటనే మన దేశంలోనే జరిగింది.
By: Tupaki Desk | 2 May 2026 10:58 AM ISTశవం శివంతో సమానం అని మనం చెప్తుంటాం.. అలాంటి శవానికే అవమానం జరిగితే.. సరిగ్గా ఇలాంటి ఘటనే మన దేశంలోనే జరిగింది. మనిషి మరణించిన తర్వాత కూడా కనీసం అంత్యక్రియలకు వెళ్లేందుకు ఇంధనం లేక గంటల కొద్దీ నిరీక్షించాల్సి రావడం విషాదకరం. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఉత్తర భారతదేశంలో ఇంధన సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటన అద్దం పడుతోంది.
యుద్ధం వేల మైళ్ల దూరంలో జరుగుతున్నా.., అది సృష్టించే విలయం సామాన్యుడిని దహిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత దారుణమైన పరిస్థితులను సృష్టిస్తోంది. నిచ్లౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిధావే గ్రామానికి చెందిన సర్వేశ్ కసౌధన్ అనే వ్యక్తి బుధవారం మరణించాడు. అతని అంతిమ యాత్రకు శవాన్ని తరలించేందుకు ఇంధనం దొరకని పరిస్థితి ఏర్పడడం మానవత్వానికే మచ్చ.
శ్మశానానికి వెళ్లే లోపే.. ‘చమురు’ కష్టాలు
సిధావే గ్రామంలో జరిగిన ఈ ఘటన కన్నీరు పెట్టుస్తోంది. సర్వేశ్ కసౌధన్ అనే వ్యక్తి బుధవారం మరణించారు. కుటుంబ సభ్యులు శవాన్ని వాహనంలో శ్మశానానికి తరలిస్తుండగా, మధ్యలోనే వాహనంలో ఇంధనం అయిపోయింది. డ్రైవర్ వాహనాన్ని సమీపంలోని పెట్రోల్ బంకుకు తీసుకెళ్లగా, అక్కడ అప్పటికే భారీ క్యూ ఉంది. శవం ఉన్న వాహనమని కూడా చూడకుండా, ఆ వాహనాన్ని దాదాపు 2 గంటల పాటు క్యూలో నిలబెట్టాల్సి వచ్చింది. అంతసేపు వేచి చూసినా.., ‘స్టాక్ అయిపోయింది’ అంటూ బంకును మూసివేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది.
శవాలూ క్యూలో నిలబడాల్సిన దౌర్భాగ్యం
ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఒక వ్యక్తి ఆ వీడియోలో వ్యాఖ్యానిస్తూ, ‘శవాలు కూడా గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సిన దౌర్భాగ్యం వచ్చిపడింది’ అని చేసిన కామెంట్ ప్రస్తుత సమాజంలోని దయనీయ స్థితిని ప్రతిబింబిస్తోంది. మరణించిన వ్యక్తికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న కుటుంబ సభ్యుల ఆరాటం, ఇంధన కొరత ముందు ఓడిపోయింది.
ఇరాన్ యుద్ధం – ఇంధన సెగలు
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఉద్రిక్తతల వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ముడి చమురు సరఫరా తగ్గింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి, ఉన్న చోట భారీగా క్యూలు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికుల మధ్య పోరు అని అనుకునేవారు. కానీ, నేటి ప్రపంచంలో యుద్ధం అంటే సామాన్యుడి కడుపు కొట్టడంగా మారిపోయింది. మరణించిన వారికి అంత్యక్రియలు జరగకుండా చేయడం అని ఈ ఘటన నిరూపిస్తోంది. ఇంధన కొరత కేవలం వాహనాల రాకపోకలకే కాదు.. అత్యవసర సేవలకు, చివరకు అంతిమ యాత్రలకు కూడా అడ్డంకిగా మారడం అత్యంత విచారకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన నిల్వలను క్రమబద్ధీకరించకపోతే ఇటువంటి అమానవీయ ఘటనలు మరిన్ని చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదు..
