Begin typing your search above and press return to search.

హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ కు షాక్.. తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ఫ్రెష్ కు షాక్ తగిలింది.

By:  Garuda Media   |   8 July 2026 1:41 PM IST
హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ కు షాక్.. తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు
X

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ఫ్రెష్ కు షాక్ తగిలింది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ ఉత్పత్తిపై FSSAI (కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ) తాజాగా నోటీసులు జారీ చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటన.. లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై మరింత నిఘా పెంచిన వేళ.. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల ఆధారంగా కొన్ని.. సుమోటోగా మరికొందరికి నోటీసులు జారీ చేస్తోంది.

హెరిటేజ్ ఫ్రెష్ కు మంగవారం నోటీసు జారీ అయ్యింది. ప్యాకింగ్ పై ఫ్రెష్ పన్నీర్ అని ముద్రించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫుడ్ సేఫ్టీ చట్టంలోని షెడ్యూల్ 5 ప్రకారం.. ఒక ప్యాక్డ్ ప్రొడక్టు మీద ఫ్రెష్ అనే పదాన్ని వాడటానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. హెరిటేజ్ సంస్థ ఆ నిబంధనల్ని పక్కాగా పాటించలేదన్నది తాజా ఆరోపణ. హెరిటేజ్ బ్రాండ్ కింద వాడుతున్న హెల్తీ (ఆరోగ్యకరమైన) అనే పదం కూడా ప్రకటనల నిబంధనల ప్రకారం సరి కాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఫ్రెష్ అనే పదంతో సదరు ఉత్పత్తి సహజంగానే ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందనే భ్రమను వినియోగదారుల్లో కల్పిస్తున్న కారణంగా.. వినియోగదారులకు తప్పుడు సమాచారం అందే అవకాశం ఉందన్నది ఎఫ్ఎస్ఎస్ఏఐ వాదన.

పన్నీర్ పై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ యాజమాన్యానికి ఏడు రోజుల డెడ్ లైన్ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు హెరిటేజ్ టోటల్ కర్డ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. ఈ సందర్భంగా పెరుగులో ఉండాల్సిన పాల కొవ్వు శాతం కేంద్ర నిబంధనల కంటే తక్కువగా ఉన్నట్లుగా తేలింది. నాణ్యత లోపంగా పేర్కొంటూ రూ.లక్ష జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో హెరిటేజ్ సంస్థ గురుగ్రామ్ లోని ఫుడ్ సేఫ్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ లో సవాలు చేసింది. ఈ సందర్భంగా జరిమానాపై తాత్కాలిక నిలిపివేత (స్టే) విధించింది. దీంతో.. ఈ కేసు అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ సందర్భంగా తమ మీద తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా హెరిటేజ్ ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది.

ఈ అంశంపై హెరిటేజ్ వాదన చూస్తే..అధికారులు శాంపిల్స్ సేకరించే విధానంలో తప్పులు జరిగాయని పేర్కొంది. పెరుగు.. పాలు లాంటి పదార్థాలను పరీక్షించే ముందు వాటిని పూర్తిగా కలపాలని.. అలా చేయకపోతే వెన్న పైకి తేలుతుందని.. కింద ఉన్న పెరుగును మాత్రమే శాంపిల్ గా తీసుకుంటే.. సహజంగానే కొవ్వు శాతం తక్కువగా చూపిస్తుందని పేర్కొంది. ఇది కేవలం టెక్నికల్ పారామీటర్ పరీక్షకు సంబంధించిన లోపమే తప్పించి.. పెరుగులో ఎలాంటి కల్తీ కానీ రసాయనాలు కానీ లేవని.. ఇదేమీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చిందన్నంతలోనే.. తాజాగా ఫ్రెష్ పన్నీర్ కు నోటీసులు జారీ కావటం గమనార్హం. మరి.. ఈసారి హెరిటేజ్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.