గంజాయి వివాదం, యువతి వ్యవహారం.. యువకుడి మర్మాంగాలు నలిపి హతమార్చిన స్నేహితులు
హైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. గంజాయి వ్యాపారంలో వివాదాలు, ఒక యువతి విషయంలో తలెత్తిన గొడవలు చివరకు ఒక యువకుడి ప్రాణాలు తీసే వరకు వెళ్లాయి.
By: A.N.Kumar | 10 July 2026 4:10 PM ISTహైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. గంజాయి వ్యాపారంలో వివాదాలు, ఒక యువతి విషయంలో తలెత్తిన గొడవలు చివరకు ఒక యువకుడి ప్రాణాలు తీసే వరకు వెళ్లాయి. నమ్ముకున్న స్నేహితులే ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి, మర్మాంగాలు నలిపి హతమార్చడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
గంజాయికి బానిసగా మారి..
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. మృతుడు కొంతకాలంగా గంజాయికి బానిసయ్యాడు. కేవలం అలవాటుకే పరిమితం కాకుండా గంజాయి వ్యాపారంలోనూ చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం. అతని ప్రవర్తన నచ్చని కుటుంబ సభ్యులు గతంలో నివాస ప్రాంతాన్ని మార్చినప్పటికీ అతని అలవాట్లలో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. పాత స్నేహితులతోనే తిరుగుతూ గంజాయి లావాదేవీలను కొనసాగించాడు.
ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ రేపిన చిచ్చు
ఇటీవలి కాలంలో మృతుడి వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో తన స్నేహితుడి ఫోన్‌ను వాడుతుండేవాడు. ఈ క్రమంలోనే సదరు స్నేహితుడి మొబైల్ నుండి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక యువతికి అసభ్యకర సందేశాలు పంపించాడు. ఈ విషయం తెలిసిన ఆ యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు మొబైల్ నంబర్ యజమాని అయిన యువకుడికి ఫిర్యాదు చేసింది.
తన ఫోన్ నుండి మరొకరికి అసభ్యకర మెసేజ్‌లు వెళ్లడం.. అది కూడా ఒక యువతి విషయంలో కావడంతో స్నేహితుల మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో గత కొంతకాలంగా గంజాయి లావాదేవీలకు సంబంధించి ఇరువర్గాల మధ్య ఉన్న పాత వివాదాలు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో స్నేహితుల మధ్య పగ, ప్రతీకారాలు మరింత ముదిరాయి.
నమ్మించి తీసుకెళ్లి.. వెంటాడి వేటాడి..
ఈ వివాదాలన్నింటినీ మాట్లాడుకుని పరిష్కరించుకుందామని నమ్మించిన నిందితులు.. సదరు యువకుడిని గ్రామ శివారులోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించారు. అక్కడ అందరూ కలిసి మద్యం, గంజాయి సేవించిన అనంతరం పాత గొడవలపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో మాట మాట పెరిగి నిందితులు యువకుడిపై ఒక్కసారిగా దాడికి దిగారు.
ప్రాణభయంతో సదరు యువకుడి అక్కడి నుండి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వదలకుండా వెంటాడారు. పట్టుకుని కిందపడేసి తీవ్రంగా కొట్టడమే కాకుండా.. అత్యంత క్రూరంగా అతని మర్మాంగాలపై దాడి చేసి నలిపేశారు. తీవ్ర రక్తస్రావం, ఊపిరాడకపోవడంతో సదరు యువకుడు అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. యువకుడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేశారు.
ఈ దారుణ హత్యకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రధాన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కేవలం క్షణికావేశం, గంజాయి మత్తు, అమ్మాయి విషయంలో వచ్చిన గొడవ ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకోవడం నగరంలో కలకలం రేపుతోంది.
