Begin typing your search above and press return to search.

బస్సులో ఉచిత ప్రయాణం... తెరపైకి కొత్త రచ్చ!

ఆధారు కార్డు మాత్రమే చూపాలా.. ఫోన్ లో సాఫ్ట్ కాపీ చూపిస్తే సరిపోదా అంటూ ఒక యువతి ఫైరయ్యింది. ఇప్పుడు ఇదో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 9:46 AM GMT
బస్సులో ఉచిత ప్రయాణం... తెరపైకి కొత్త రచ్చ!
X

ప్రస్తుతం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మహిళలకు ఫ్రీ బస్ అనే హామీ ఇస్తే అధికారం కన్ ఫాం అనే స్థాయిలో రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నాయనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. ఈ హామీతో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది! అయితే ఈ ఫ్రీ బస్ వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు తెరపైకి వచ్చాయి. అయితే అవి ప్రచారంలోకి వచ్చేలోపు తెలంగాణలో మహిళలు.. కాంగ్రెస్ పార్టీ హామీకి మద్దతు తెలిపారు. ఈ సమయంలో ఈ హామీవల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయంటూ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారు!

ఇదే సమయంలో... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం అద్దె బస్సుల యజమానుల పాలిట శాపంగా మారిందని అంటున్నారు. ఈ పథకం కింద మహిళలను ఉచితంగా తమ గమ్య స్థానాలకు తీసుకెళ్లాల్సి రావడంతో అద్దె బస్సుల యజమానులు తాము నష్టపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు.

ఈ సమయంలో తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించాలంటే ఒరిజినల్ ఆధారు కార్డు మాత్రమే చూపాలా.. ఫోన్ లో సాఫ్ట్ కాపీ చూపిస్తే సరిపోదా అంటూ ఒక యువతి ఫైరయ్యింది. ఇప్పుడు ఇదో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం కింద తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడం కోసం ఒక యువతి బస్సు ఎక్కింది. ఈ సమయంలో త‌న ఫోన్‌ లో ఉన్న ఆధార్ కార్డ్ ను చూపించింది. అయితే అందుకు అంగీకరించని కండ‌క్టర్... ఉచిత ప్రయాణానికి ఆమెకు అనుమ‌తి ఇవ్వలేదు.

దీంతో ఆ యువతికి – కండక్టర్ కూ మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఈ సందర్భంగా స్పందించిన యువతి... ఒరిజినల్ ఆధార్, ఫోన్‌ లో ఉన్న ఆధార్ నంబర్ ఒకటేన‌ని వాదించారు. ఇండియా మొత్తంలో ఎక్కడ ఆ నెంబర్ వెరిఫై చేసినా తనపేరే వస్తుందని.. అలాంటప్పుడు ఒరిజినల్ చూపిస్తే ఏమిటి.. ఫోన్ లో సాఫ్ట్ కాపీ చూపిస్తే ఏమిటి ప్రాబ్లం అంటూ ఫైరయ్యింది!

రద్దీని క్యాష్ చేసుకుంటున్న దొంగలు!:

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో ఉండటంతో బస్టాండ్లన్నీ రద్దీగా మారిపోతున్నాయి.. బస్సులన్నీ హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయి! ఈ రద్దీని దొంగలు క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ రద్దీలో దూరుతున్న దొంగలు ప్రయాణికుల బ్యాగులు, పర్సులు, సెల్ ఫోన్లూ మాయం చేస్తున్నారని అంటున్నారు.

ఈ మేరకు అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బస్టాండ్లలో రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. అయితే దీనికోసం ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటుందా.. లేక, ప్రభుత్వం స్పందించనిపక్షంలో సొంతంగా సిబ్బందిని కేటాయించుకుంటుందా అనేది వేచి చూడాలి!