ఆర్టీసీ ఫ్రీ బస్సులు.. సర్కారుకు లాభమెంత ..!
ఆగస్టు 15వ తారీకు నుంచి రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Garuda Media | 29 July 2025 4:44 PM ISTఆగస్టు 15వ తారీకు నుంచి రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రాష్ట్రంలో ఉన్న కోటి 80 లక్షల మందికి పైగా మహిళలకు మేలు చేకూర్చే అంశం అని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా కూటమి ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రారంభమైన వ్యతిరేకత తగ్గుముఖం పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి.. వచ్చే నష్టాలు ఏంటి.. అనేది కూడా ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
లాభాలపరంగా చూసుకుంటే రాజకీయంగా మహిళా ఓటు బ్యాంకు, కొంతమేరకు టిడిపికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అసలు అమలు చేస్తారా చేయరా అని సందేహంగా ఉన్నటువంటి ఈ కీలక పథకాన్ని అమలు చేసి మహిళలకు భరోసా ఇచ్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అయితే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలు కూడా ప్రభుత్వానికి ఎక్కువగానే ఉన్నాయి. నెలకు 40 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం భరించాల్సి ఉంది. అదే విధంగా ఆటోలు టాక్సీల వ్యాపారం దెబ్బ తినే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
ఆటోవాలాలకు, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం సహాయం చేస్తుందని ప్రకటించినప్పటికీ దీనికి సంబంధించిన విధి విధానాలను ఇంకా రూపొందించలేదు. ఎంత లేదన్నా ఏడాదికి 10 నుంచి 15 వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుందని లెక్కలు వేశారు. దీనిని అమలు చేస్తే ఆ భారం మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఉచిత బస్సు ప్రయాణాలు వల్ల ఆర్టీసీ బలోపేతం అవుతుందన్నది కొందరు చెబుతున్న మాట. అంటే ఆర్టీసీ బస్సుల వినియోగం పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి డబ్బులు అందుతాయి కాబట్టి అప్పులు తీరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అయితే, దీనిలో వాస్తవాలు ఎంత అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళల్లో సంతోషాన్ని నింపే అవకాశం ఉంటుందన్నది కాయంగా కనిపిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి ఇది టిడిపికి బలమైన ఓటు బ్యాంకుగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కష్టనష్టాలు ఎదురైనప్పటికీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతున్న నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా మహిళలకు మేలు చేశామన్నది ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరగనుంది. ఇది వైసీపీకి పెద్ద ఎవరు దెబ్బ గా మారుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరి ఎంత మేరకు ఇది వచ్చే ఎన్నికల నాటికి ప్రభావం చూపిస్తుంది. దీనికి మించి వైసిపి ఇంకా ఏదైనా ప్రకటిస్తుందా అనేది కాలమే తేల్చాలి. ఏదేమైనా ఇప్పటికైతే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక పెద్ద ప్రయోగంగానే చెప్పాల్సి ఉంటుంది.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ అక్కడ ఇబ్బందులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాల మంత్రులు కూడా చెబుతున్నారు. పైకి పథకం అమలుతో మహిళలకు మేలు జరుగుతోందని చెబుతున్నప్పటికీ ఆర్థికంగా భారాలు పడడం ఇతర వ్యాపారాలు దెబ్బతినడం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఏపీలో ఎలాంటి ప్రభావం ఉంటుందనేది చూడాలి.
