Begin typing your search above and press return to search.

వరంగల్ లో కొత్త దందా.. వందలాది విద్యార్థులను దోచేశారు

వెబ్ సైట్ వేదికగా పలు స్కీంలు తెర మీదకు తీసుకొచ్చి ఒక రోజు నుంచి 120 రోజుల వరకు పెట్టుబడులుపెడితే సుమారు 400 శాతం లాభాలు ఇస్తామని ప్రచారం చేశారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:55 AM GMT
వరంగల్ లో కొత్త దందా.. వందలాది విద్యార్థులను దోచేశారు
X

డబ్బులు ఊరికే రావు. ఈ చిన్న పాయింట్ ను ఎందుకు మర్చిపోతారో అర్థం కానిది. ఎవరూ ఊరికే డబ్బులు ఇవ్వరు కదా? అలాంటప్పుడు ఆకర్షణీయమైన మాటలు చెప్పినంతనే లాజిక్ తో అలాంటి మోసాలకు దూరంగా ఉండాల్సి ఉన్నప్పటికీ.. అదేమీ లేకుండా ఎప్పటికప్పుడు మరింత డబ్బును ఈజీగా సొంతం చేసుకోవచ్చన్న పేరాశ.. లక్షలాది మందిని ముంచేస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే వరంగల్ పట్టణంలో చోటు చేసుకుంది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఇద్దరు లెక్చరర్లు ఈ అక్రమ దందాలో ఇరుక్కుపోవటమే కాదు.. తమ మాటల్ని వినే విద్యార్థుల్ని సైతం ఇందులోకి దించేసి కోట్లాది రూపాయిల్ని కొల్లగొట్టిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

గత అక్టోబరులో వరంగల్ కేంద్రంగా సరికొత్త దందాకు తెర తీశారు. ఒక్క రోజు పెట్టుబడి పెడితే 200 వాతం లాభాలు ఇస్తామంటూ ముగ్గులోకి దించారు. అదెలా అన్నోళ్లకు.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో డెన్మార్క్ కు చెందిన ఒక ప్రముఖ సంస్థ తమ డేటాను భద్రపరిచేందుకు వీలుగా భారీ సర్వర్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తోందని.. అందులో భారీగా లాభాలు వస్తాయని పేర్కొన్నారు. అందుకు పెట్టుబడి పెట్టిన తర్వాతి రోజే 200 శాతం లాభాలు ఇస్తామని ఆశ జూపారు. అలా కొందరికి ఇచ్చారు కూడా.

వెబ్ సైట్ వేదికగా పలు స్కీంలు తెర మీదకు తీసుకొచ్చి ఒక రోజు నుంచి 120 రోజుల వరకు పెట్టుబడులుపెడితే సుమారు 400 శాతం లాభాలు ఇస్తామని ప్రచారం చేశారు. దీనికి హనుమకొండకు చెందిన ఇద్దరు లెక్చరర్లను ప్రచారానికి వాడారు. వారిలో ఒకరు గతంలో షేర్ల వ్యాపారంలో నష్టపోయిన లెక్చరర్ ఉన్నారు. భారీ లాభాలు వస్తాయని చెప్పటం.. అందుకు తగ్గట్లే చేతికి లాభాలు రావటంతో.. ఆనోట ఈ నోటా పాకి వేలాది మంది విద్యార్థులు రూ.300 నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడులుపెట్టారు.కొందరు విద్యార్థులు అయితే సెమిస్టర్ ఫీజుల్ని సైతం ఇందులో పెట్టేశారు.

కొన్ని నెలలుగా సాగుతున్న ఈ దందా జనవరి 16న భారీ ప్రకటన చేశారు. జనవరి 16న పెట్టుబడులు పెట్టే వారికి కళ్లు చెదిరే లాభాలు ఇస్తామని చెప్పటంతో కోట్లాది రూపాయిల్ని జమ చేశారు. అదే రోజు సాయంత్రం వారి వెబ్ సైట్ ఆగింది. సాంకేతిక లోపమని చెప్పి.. వాట్సాప్ లో గ్రూపు సందేశాలు పంపారు. జనవరి 18న హనుమకొండలోని ఒక హోటల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. కొత్త సభ్యులకు మోటివేషన్ తరగతుల్ని నిర్వహించారు.

దీంతో.. మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఈ ముగ్గులోకి దింపిన లెక్చరర్లు ఇద్దరు తమకు సంబంధం లేదని తేల్చటంతో.. ఒకరు పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ మొత్తం దందా బయటకు వచ్చింది. భారీలాభాల ఆశ చూపి కోట్లాది రూపాయిలు కొల్లగొట్టినట్లుగా గుర్తించారు.