Begin typing your search above and press return to search.

మీది తెనాలి.. మాది తెనాలి.. రైల్వే జాబ్స్ లో దుబాయ్ లోలా భారీ మోసం

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా వాసులు కల్యాణ్‌, గణేష్‌. ప్రవీణ్ ది మహబూబాబాద్‌. డిగ్రీ వరకు చదివిన వీరంతా నిరుద్యోగులుగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 4:30 PM GMT
మీది తెనాలి.. మాది తెనాలి.. రైల్వే జాబ్స్ లో దుబాయ్ లోలా భారీ మోసం
X

మీరు దుబాయ్ శీను సినిమా చూశారా..? అందులో రవితేజ గ్యాంగ్ ను దుబాయ్ లో ఉద్యోగాల పేరిట వేణుమాధవ్ మోసం చేసిన సీన్ గుర్తుందా..? లేదంటే, తెనాలిలో జరిగిన ఈ మోసం గురించి తెలుసుకోండి చాలు.. మొత్తం అర్థమైపోతుంది. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా జరిగిన ఉద్యోగాల మోసం ఇది. అదేదో సినిమాలో చెప్పినట్ల మీకు ఉద్యోగం బంకులో కావాలా? జింకులో కావాలా? అంటూ సాగిన వంచన ఇది. ఎంపిక ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండే రైల్వేలో కొలువులని చెప్పి.. నిలువునా ముంచిన ఉదాహరణ ఇది. అది కూడా టికెట్ కలెక్టర్ (టీసీ) ఉద్యోగం అని చెప్పి.. నకిలీ గుర్తింపు కార్డులు కూడా రూపొందించి.. వారితో శిక్షణ పేరిట కేసులు రాయిస్తుండడం గమనార్హం.

మోసపోయింది తెలంగాణ యువకులు

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా వాసులు కల్యాణ్‌, గణేష్‌. ప్రవీణ్ ది మహబూబాబాద్‌. డిగ్రీ వరకు చదివిన వీరంతా నిరుద్యోగులుగా ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిప్రసాద్‌ పరిచయమయ్యాడు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. రూ.లక్షల్లో వసూలు చేశాడు. అయితే.. అసలు ఉద్యోగాలే లేవు. కానీ, టీసీ జాబ్ వచ్చినట్లు నమ్మించాడు. నకిలీ ఐడీ కార్డులు రూపొందించాడు. విషయం ఏమంటే.. వీరికి టీసీలు విధించే జరిమానాల తాలూకు సంబంధించి పుస్తకాలూ ఇచ్చాడు. ఇంకేం తమకు ఉద్యోగాలు వచ్చాయని నమ్మిన యువకులను ట్రైనింగ్ అంటూ విజయవాడ-ఒంగోలు మధ్య రైళ్లలో తిరుగుతూ రోజుకో మూడు కేసులు రాయాలని సూచించాడు సాయిప్రసాద్.

కేసులు రాసిన డబ్బూ దళారీకే.

ముగ్గురు తెలంగాణ యువకులు టీసీల పేరిట రైళ్లలో తిరుగుతూ టికెట్ లేని ప్రయాణికులకు కేసులు రాస్తుండగా.. టీటీ రాజేష్ కంటపడింది. చీరాలలో వారి గుట్టురట్టయింది. రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గమనార్హం ఏమంటే.. ముగ్గురు తెలంగాణ యువకులు కేసులు రాయగా వచ్చిన డబ్బును సైత దళారీ సాయిప్రసాద్ కే ఇవ్వడం. అయితే, వీరిలో టీటీఈ రాజేష్ కు పట్టుబడింది గణేష్. చీరాల స్టేషన్‌లో కేసులు రాస్తుండగా అనుమానం వచ్చి ప్రశ్నించారు. గణేష్ పొంతన లేని సమాధానాలు చెప్పారు. చివరకు విషయాన్ని రైల్వే పోలీసుల పరిశీలనకు తీసుకెళ్లారు. గణేష్‌ ను అదుపులోకి తీసుకుని.. అతడు తెలిపిన వివరాల ఆధారంగా మిగతా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

అమాయకులు బలి.. దొరకని దళారీ..

తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు రైల్వే పోలీసులకు పట్టుబడి.. జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకోగా, దళారీ సాయిప్రసాద్ మాత్రం దొరకలేదు. అతడి కోసం గాలిస్తున్నారు. సాయిప్రసాద్ ఒక్కడే కాక.. మరికొందరు నకిలీ టీసీలు కూడా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. కాగా, ముగ్గురు యువకులు నిజమే చెబుతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీసీ ఉద్యోగాలంటే నమ్మి డబ్బులు ఇవ్వడం.. ట్రైనింగ్‌లో భాగంగా జరిమానాలు వసూలు చేసి తెమ్మంటే నమ్మడమే దీనికి కారణం. పలు అనుమానాల నేపథ్యంలో ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కావొచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే కానీ అసలు విషయాలు తేలేలా లేవు.