Begin typing your search above and press return to search.

ఇండియన్ స్టూడెంట్లకు వెల్ కమ్ చెప్పిన ఫ్రాన్స్.. ఏకంగా 30వేల మందికి ఛాన్స్

ఫ్రాన్స్ వీసా విధానాలను కూడా సులభతరం చేసింది. ఇందులో భాగంగా, ఫ్రాన్స్ రాయబార కార్యాలయం భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, నిపుణుల షెంగెన్ వీసా దరఖాస్తులను పత్రాలు అందిన 48 గంటల్లో ప్రాసెస్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   15 May 2025 10:27 PM IST
ఇండియన్ స్టూడెంట్లకు వెల్ కమ్ చెప్పిన ఫ్రాన్స్.. ఏకంగా 30వేల మందికి ఛాన్స్
X

అమెరికా విదేశీ విద్యార్థుల మీద అనేక ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ ఇండియాతో విద్యా సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 30 వేల మంది భారతీయ విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించాలని ఆ దేశం యోచిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరానికి నమోదైన ప్రస్తుత 8,000 మంది విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల అని చెప్పొచ్చు. కాబట్టి, ఇండియన్ స్టూడెంట్లను ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది అమెరికాకు బెస్ట్ ఆల్టర్నేటివ్ గా మారవచ్చు.

ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ ఒక ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్వాగతిస్తున్నామన్నారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచే విస్తృత ప్రణాళిక రచిస్తున్నట్లు వివరించారు.

ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన నివేదిక ప్రకారం.. ఫ్రాన్స్ భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది.ఇందులో భాగంగా 35 ఫ్రెంచ్ యూనివర్సిటీల్లో స్పెషల్ ఇయర్ క్లాసెస్ ఇంటర్నేషనల్స్ నిర్వహించబడతాయి. ఈ యూనివర్సిటీల్లో అనుసరించే పాఠ్యాంశాల్లో ఉన్నత పాఠశాల పూర్తి చేసిన వారందరికీ ఫ్రెంచ్ భాషలో ట్రైనింగ్ ఉంటుంది. సెలక్ట్ చేసుకున్న రంగంలో ఇంట్రడ్యూస్ కోర్సులను కూడా నిర్వహించనున్నారు.

ఈ భాషా ట్రైనింగ్ ప్రత్యేకంగా భారతీయ విద్యార్థుల కోసం మాత్రమే ఉద్దేశించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఇది అందించబడదు. అనేక ఫ్రెంచ్ బిజినెస్ స్కూల్స్‌లో భారతీయ విద్యార్థుల నమోదు పెరగడంతో ఈ ప్రత్యేక చర్యలు ప్రారంభించబడ్డాయి. తాము పెద్ద సంఖ్యలో కాకుండా తెలివైన విద్యార్థులను ఆకర్షించాలనుకుంటున్నామని ఫ్రెంచ్ అధికారులు తెలిపారు.

అదే సమయంలో ఫ్రాన్స్‌లో చదువుకున్న భారతీయ విద్యార్థులు తిరిగి భారతదేశానికి రావాలని ఫ్రాన్స్ కోరుకుంటోంది. ఇక్కడ పనిచేస్తున్న ఫ్రెంచ్ కంపెనీలలో వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో 800 ఫ్రెంచ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. 5,00,000 మందికి పైగా భారతీయులకు ఉపాధి కల్పిస్తున్నాయి. వీసా విధానాలను కూడా ఈజీ చేశారు.

ఫ్రాన్స్ వీసా విధానాలను కూడా సులభతరం చేసింది. ఇందులో భాగంగా, ఫ్రాన్స్ రాయబార కార్యాలయం భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, నిపుణుల షెంగెన్ వీసా దరఖాస్తులను పత్రాలు అందిన 48 గంటల్లో ప్రాసెస్ చేస్తుంది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.