Begin typing your search above and press return to search.

చైనా అతికి షాకిచ్చిన మరో నాలుగు దేశాలు

తన చుట్టూ ఉన్న వారిలో ఏ ఒక్కరితోనూ సరిగా లేకుండా.. ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక పేచీ పెట్టుకునే దేశం అన్నంతనే గుర్తుకు వచ్చేస్తుంది చైనా.

By:  Tupaki Desk   |   3 Sep 2023 6:28 AM GMT
చైనా అతికి షాకిచ్చిన  మరో నాలుగు దేశాలు
X

సరిహద్దుల్ని పంచుకునే దేశం ఏదైనా సరే.. ఏదో ఒక లొల్లితో కిందా మీదా పడాల్సిందే. పేచీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే చైనా.. ఇటీవల విడుదల చేసిన అధికారిక మ్యాప్ లో పేర్కొన్న ప్రాంతాలపై భారత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. అదే సమయంలో భారత్ మాదిరే మరో నాలుగు దేశాలు సైతం చైనా కొత్త మ్యాప్ ను రిజెక్టు చేయటం ఆసక్తికరంగా మారింది.

చైనా కొత్త అధికారిక మ్యాప్ స్ప్రాట్లీ.. పారాసెల్ దీవులపై దాని సార్వభౌమాధికారాన్ని.. దాని జలాలపై అధికార పరిధిని ఉల్లంఘిస్తున్నట్లుగా వియత్నాం పేర్కొంది. మ్యాప్ లోని తొమ్మిది చుక్కల రేఖ ఆధారంగా చైనా ప్రకటించిన సార్వభౌమాధికారం.. సముద్రయాన ప్రకటనలు చెల్లవని ఆ దేశా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇతర దేశాలు సైతం చైనా మ్యాప్ ను తిరస్కరించాయి.

అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చేసి.. అవన్నీ తమ దేశం పరిధిలో అంటూ చేసిన చేష్టను భారత్ తీవ్రంగా ఖండించటంతో పాటు.. నిరసన వ్యక్తం చేసింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా వాదనల్ని గుర్తించలేదని ఫిలిప్పీన్స్ పేర్కొంది. మలేషియా.. తైవాన్ ప్రభుత్వాలు సైతం చైనా తమ భూభాగాన్ని క్లెయిమ్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తూ ప్రకటనలు జారీ చేశాయి.

ఇదిలా ఉంటే.. చైనా తన తెంపరితనాన్ని.. మాటల దూకుడును ప్రదర్శించింది. తాము విడుదల చేసిన అధికారిక మ్యాప్ పై పలు దేశాల అభ్యంతరాల నేపథ్యంలో మీడియా భేటీని ఏర్పాటు చేసిన చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. చైనా మ్యాప్ పై ఇతర దేశాలు రాద్దాంతం చేయకుండా.. అతిగా వ్యాఖ్యానించకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలవని పేర్కొన్న తీరు చూస్తే.. చైనా దుర్మార్గం ఏమిటో అర్థమవుతుంది.

1947 నాటి మ్యాప్ లో అస్పష్టమైన గీతలు.. తొమ్మిది డ్యాష్ లైన్ ను చూపుతూ దక్షిణ చైనా సముద్రంలోని హైనాన్ ద్వీపానికి దక్షిణంగా 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిందువు వరకు 80 శాతం కంటే ఎక్కువ భాగాన్ని తమదిగా చైనా తాజాగా క్లెయిమ్ చేస్తోంది. అయితే.. ఈ ప్రాంతాల్ని వియత్నాం.. ఫిలిప్పీన్స్.. బ్రూనె.. మలేషియా.. తైవాన్ లు సైతం ఇప్పటికే తమవిగా ప్రకటించుకున్నాయి. దీంతో చైనాతో ఆయా దేశాలకు సరిహద్దుల వివాదం నడుస్తోంది. భారత్ తో కూడా సరిహద్దు పంచాయితీ ఉన్న సంగతి తెలిసిందే. భారత్ విషయానికి వస్తే చైనా తాజాగా విడుదల చేసిన వ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ను సౌత్ టిబెట్ గా.. అక్సాయిచిన్ ను 1962 యుద్ధంలో చైనా ఆక్రమించుకున్నట్లుగా చూపిస్తోంది. తాజా ఎడిషన్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని పదకొండు ప్రాంతాలు తమవిగా చైనా చూపించటం వివాదాస్పదమైంది.