Begin typing your search above and press return to search.

80 మంది ఎంఎల్ఏల మీద కేసులా ?

తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంఎల్ఏల్లో 80 మంది కేసులున్నట్లు పోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ప్రకటించారు

By:  Tupaki Desk   |   6 Dec 2023 1:30 AM GMT
80 మంది ఎంఎల్ఏల మీద కేసులా ?
X

తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంఎల్ఏల్లో 80 మంది కేసులున్నట్లు పోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో టికెట్లు దక్కించుకున్న వారు, ఎంఎల్ఏలుగా పోటీచేస్తున్న వారిపై నమోదైన కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీచేసిన అభ్యర్ధులు, సిట్టింగ్ ఎంఎల్ఏల్లో 226 మంది క్రిమినల్ కేసులున్నాయని పద్మనాభరెడ్డి ఇదివరకే ప్రకటించారు.

ఇపుడు గెలిచిన ఎంఎల్ఏల్లో ఎంతమంది ఎలాంటి కేసులున్నాయన్న విషయాన్ని వివరించారు. ఈ వివరాలను ఎంఎల్ఏలు దాఖలుచేసిన అఫిడవిట్లు, పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ల ఆధారంగానే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. వివిధ పార్టీల తరపున గెలిచిన 119 మంది ఎంఎల్ఏల్లో 80 మంది మీద రకరకాల కేసులు నమోదైనట్లు చెప్పింది. నేరచరితులకు టికెట్లు ఇవ్వద్దని సుప్రింకోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఏ పార్టీ కూడా పట్టించుకోవటంలేదని పద్మనాభరెడ్డి వాపోయారు.

గెలుపు గుర్రాలన్న ఒకే కారణంతో అన్నీ పార్టీలు కేసులు నమోదైన వారికే టికెట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తున్నట్లు మండిపడ్డారు. 80 మంది మీద నమోదైన కేసులను మూడురకాలుగా వర్గీకరించినట్లు చెప్పారు. మొదటిది తెలంగాణా ఉద్యమకాలంలో పెట్టిన కేసులు. రెండోది ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించారని పెట్టిన కేసులు. మూడోది చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు నమోదైన కేసులుగా వివరించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు అంటే కిడ్నాపులు, భూకబ్జాలు, దొమ్మీలు, చీటింగ్, బెదిరింపుల్లాంటి తీవ్రమైన నేతల్లో పాల్గొనటంగా చెప్పారు.

ఉద్యమాల్లో పాల్గొన్నారని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారనే కారణాలతో 16 మంది కేసులు నమోదైనట్లు రెడ్డి చెప్పారు. ఇక మిగిలిన 64 మందిపైన రకరకాల క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 2018లో గెలిచిన ఎంఎల్ఏల్లో 65 మంది మీద రకరకాల కేసులుంటే ఇపుడు 80 మంది మీద కేసులుండటంపై రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయాల్లో నేరచరితులు పెరిగిపోతున్నారనటానికి తాజా ఎన్నికలే ఉదాహరణగా చెప్పారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 50 మంది మీద, బీఆర్ఎస్ తరపున నెగ్గిన వారిలో 19, బీజేపీ ఎంఎల్ఏలు ముగ్గురు, ఎంఐఎం తరపున గెలిచిన నలుగురిపై కేసులున్నాయని చెప్పారు.