Begin typing your search above and press return to search.

అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నా.. తేల్చేసిన మాజీ ఉపాధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ఒక ప్రముఖుడు వైదొలిగారు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 3:30 PM GMT
అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నా.. తేల్చేసిన మాజీ ఉపాధ్యక్షుడు
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ఒక ప్రముఖుడు వైదొలిగారు. ఇదే విషయాన్ని ఆయన ఒక సభ సందర్భంగా అందరి ఎదుట చెప్పేయటం ఆసక్తికరంగా మారింది.రిపబ్లిక్ పార్టీకి చెందిన మైక్ పెన్స్ తాను అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలుగుతున్నట్లుగా చెప్పారు. రిపబ్లికన్ జెవిష్ కొయిలేషన్ వార్షిక సదస్సు సందర్భంగా ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడిగా సుపరిచితులైన ఆయన ఎన్నికల రేసు నుంచి వైదొలుగుతున్నట్లుగా పేర్కొన్నారు.

అనేక చర్చల అనంతరం అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే.. తాను పోటీ నుంచి తప్పుకున్నా.. పార్టీ తరఫున బరిలో ఉన్న వారికి తన వంతు సాయాన్ని అందిస్తానని చెప్పారు. తాను తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల నుంచి మాత్రమే తప్పుకున్నానే తప్పించి.. సంప్రదాయ విలువలకు తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.

ఇంతకూ పెన్స్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ఎందుకు తప్పుకున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆర్థిక అంశాలే కీలకమని చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ పోలింగ్ లోనూ ఆయన వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో ముందుకు సాగేకన్నా.. తప్పుకోవటం ఉత్తమం అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే వారు.. తొలుత తమ పార్టీ తరఫున బరిలో నిలవాలనుకునే వారితో పోటీ పడాల్సి ఉంటుంది. అందులో ఎక్కువ ఓట్లు ఎవరికి దక్కుతాయో వారే తుది జాబితాలో నిలుస్తారు.

పెన్స్ విషయానికి వస్తే ఆయన.. ట్రంప్ ప్రభుత్వంలో దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. అంతకు ముందు ఇండియానా గవర్నర్ గా.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా పని చేశారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత మూలాలు ఉన్న నిక్కీ హేలీ.. వివేక్ రామస్వామి.. ర్యాన్ బింక్లీ.. టిమ్ స్కాట్ తదితరులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి నిలుస్తారు. మిగిలిన వారంతా దశల వారీగా వైదలగొలాల్సి ఉంటుంది.