Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయంలో ట్రంప్ పై కేసు!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా కేసుల సుడిగుండంలో చిక్కుకుంటోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Aug 2023 7:27 AM GMT
ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయంలో ట్రంప్ పై కేసు!
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా కేసుల సుడిగుండంలో చిక్కుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కేసుల్లో చిక్కుకున్న ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది! దీంతో ట్రంప్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మూడోకేసులో కూడా నేరాభియోగాలు నమోదవ్వడంతో వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై మరో కేసుకు సంబంధించి నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనపై నేరాభియోగాలు నమోదవ్వగా.. తాజాగా మరో కేసు తెరపైకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారనేది ఈ కేసు కావడం గమనార్హం.

అవును... 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు చేసిన ప్రయత్నానికి గానూ డొనాల్డ్ ట్రంప్‌ పై తాజాగా నేరాభియోగాలు నమోదయ్యాయి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా ట్రంప్‌ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు అధికారులు న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

ఇదే సమయంలో బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ట్రంప్‌ పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ జాక్‌ స్మిత్‌ అధికారులను ఆదేశించారు.

కాగా.. 2021 జనవరి 6న ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించిన ప్రసంగించిన కొద్ది గంటలకే అమెరికా క్యాపిటల్‌ భవనంపై భీకర దాడి జరిగిన సంగతి తెలిసిందే. బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ సమావేశమైన వేళ.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్‌ భవనంలోకి దూసుకెళ్లారు. ఆ ఘటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరోవైపు ఇప్పటికే ఓ శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసులో, శ్వేతసౌధం రహస్య పత్రాలను తరలించిన కేసులో ట్రంప్ పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇక, జార్జియాలోనూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై స్థానిక న్యాయస్థానంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో తాజాగా మూడో కేసు తెరపైకి వచ్చింది.