Begin typing your search above and press return to search.

అనారోగ్యంతో వైఫ్.. ఎట్టకేలకు ఆరు గంటలు కలిసే ఛాన్సు లభించింది

గతంలో ఉండే పరిమితులు మాయమయ్యాయి. రాజకీయాలు అత్యంత కఠినంగా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   12 Nov 2023 5:01 AM GMT
అనారోగ్యంతో వైఫ్.. ఎట్టకేలకు ఆరు గంటలు కలిసే ఛాన్సు లభించింది
X

గతంలో ఉండే పరిమితులు మాయమయ్యాయి. రాజకీయాలు అత్యంత కఠినంగా మారుతున్నాయి. దూకుడు రాజకీయాలకు ప్రతీకారం తోడు కావటంతో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. టార్గెట్ చేయాలే కానీ.. అవతలి మనుషులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఇట్టే జైల్లోకి వెళ్లిపోతున్నారు. ఏళ్లకు ఏళ్లు గడిచినా బెయిల్ లభించదు. కేసులు విచారణకు రావు. జైల్లో మాత్రం నెలల తరబడి మగ్గిపోతున్న పరిస్థితి. లిక్కర్ స్కాంలో కొందరి ప్రముఖుల పేర్లు వినిపించి.. అరెస్టు వరకు వెళ్లి ఆగిపోవటం.. ఎన్ని నెలలు గడిచినా చర్యలకు సిద్ధం కాకపోవటం ఒక ఎత్తు అయితే.. మరోవైపు జెట్ స్పీడ్ తో ప్రతీకారాన్ని తీర్చేసుకుంటున్న వైనం కనిపిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొన్ని నెలల క్రితం అరెస్టు అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎట్టకేలకు తన భార్యను కలుసుకోగలిగారు. అది కూడా కేవలం ఆరు గంటలు మాత్రమే. ఉదయం పది గంటల వేళలో అనారోగ్యంలో ఉన్న తన భార్యను కలిసిన ఆయన సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఆమెతో ఉన్నారు. అనంతరం తీహార్ జైలుకు బయలుదేరి వెళ్లిపోయారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా.. విద్య.. ఎక్సైజ్ శాఖలతో పాటు క్రేజీవాల్ ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించిన మనీశ్ సిసోడియా.. కొత్త లిక్కర్ పాలసీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఆరోపిస్తూ.. అరెస్టుచేయటం తెలిసిందే.

ఫిబ్రవరి 26న ఆయన్ను సీబీఐ అధికారులు అరెస్టు చేయగా.. కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. దీంతో.. ఆయన్ను తీహార్ జైల్లో ఉంచారు. జూన్ లో భార్యను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. అప్పటికే ఆమె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో.. అప్పట్లో ఆమెను కలుసుకునే వీలు చిక్కలేదు. తాజాగా ఆరు గంటల పాటు భార్యను కలిసేందుకు వీలుగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

దీంతో.. పోలీసు జీపులో ఇంటికి వచ్చిన మనీశ్ సిసోడియా.. ఆరు గంటల పాటు గడిపారు. తిరిగి వెళ్లిపోతున్న వేళ.. భర్తను పట్టుకొని ఆయన భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఫోటోను షేర్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. ‘ఈ ఫోటోను చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. దేశంలోని పేద చిన్నారుల జీవితాలపై కొత్త ఆశల్ని కల్పించిన వ్యక్తికి ఇలా అన్యాయం చేయటం సరైనదేనా?’ అంటూ ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు.