Begin typing your search above and press return to search.

మాజీ సీఎస్ భార్య పేరున 25 ఎకరాలు.. అసలు ఏమిటి ఇష్యూ?

అవును... తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ భార్య డాగ్యన్ముద్రకు సంబందించిన ఒక స్థలం విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 3:07 PM GMT
మాజీ సీఎస్  భార్య పేరున 25 ఎకరాలు.. అసలు ఏమిటి ఇష్యూ?
X

రెండు రోజుల క్రితం హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ ఆస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య ఆస్తులకు సంబందించిన వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో... గత ప్రభుత్వ హయాంలో ఏమి జరిగిందనే విషయం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

అవును... తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ భార్య డాగ్యన్ముద్రకు సంబందించిన ఒక స్థలం విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో... డాగ్యన్ముద్రకు రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25 ఎకరాల స్థలం ఉంది! అయితే ఇక్కడ ఎకరం భూమి విలువ రూ.3 కోట్లుగా ఉందని అంటున్నారు. అంటే... ఈ భూమి మొత్తం విలువ సుమారు 75 కోట్ల రూపాయలు అన్నమాట.

ఖాతా నం.5237లో సర్వే నం.260/అ/1/1 లో 7.19 ఎకరాలు, 249/ఆ1 లో 8 ఎకరాలు, 249/ఆ2 లో 10 ఎకరాల భూమి ఉంది! ఈ మొత్తం కలిపితే 25.19 ఎకరాలుగా ఉంది. ధరణి పోర్టల్ లో ఖాతా నంబర్ కూడా ఉంది. అయితే ఈ భూమి ఎలా వచ్చిందో తెలియడం లేదని.. ఖాతా నంబర్ 5237 అనే నంబర్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది.

పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వారా కాకుండా... సాదా బైనామా ద్వారా కొన్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో ఈ భూమికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం చేస్తే కనిపించడం లేదని తెలుస్తుంది. దీంతో ఈ భూమి సక్రమంగా వచ్చింది కాదంటూ ఆరోపణలు మొదలైపోయాయని తెలుస్తుంది.

ఈ క్రమంలో రెరా సెక్రెటరీగా బాలకృష్ణ ఉన్న సమయంలో సోమేష్ కుమార్ ఛైర్మన్‌ గా ఉన్నారని.. ఆ సమయంలోనే యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరున 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారని.. ఈ విషయంపై ఆధారలను సేకరించే పనిలో ఏసీబీ బిజీగా ఉందని అంటున్నారు. మరి... ఈ విషయంపై ఏసీబీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందనేది వేచి చూడాలి!!