ఏఐ మనుషులందరినీ చంపేస్తుంది.. ఆంథ్రోపిక్ రీసెర్చర్ బయటపెట్టిన సంచలన నిజాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.
By: A.N.Kumar | 9 Sept 2026 3:34 PM ISTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ లో రీసెర్చర్‌గా పనిచేస్తున్న జాకబ్ కాక్సన్ టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసే హెచ్చరికలు చేశారు. త్వరలోనే ఏఐ సిస్టమ్స్ మానవాళి ఉనికికే ప్రమాదకరంగా మారబోతున్నాయని.. మరికొన్నేళ్లలో మనుషులందరినీ చంపేసే అవకాశం ఉందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ వల్ల కలగబోయే భయంకరమైన పరిణామాలను తలచుకుని భయపడే తాను సంస్థకు రాజీనామా చేసినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
‘మానవ జీవితాలతో జూదం ఆడుతున్నారు’
గత మూడేళ్లుగా టెక్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజ ఏఐ సంస్థలు ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లలో తాను వివిధ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించానని జాకబ్ కాక్సన్ తెలిపారు. అయితే ఈ రెండు సంస్థలు ఎంతమాత్రం సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. "ఈ కంపెనీలు మానవాళి భద్రతను పక్కనపెట్టి కేవలం స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల 'సెల్ఫ్ ఇంప్రూవింగ్ సూపర్ ఇంటెలిజెన్స్' అభివృద్ధి చేయడం కోసమే గుడ్డిగా పరుగులు తీస్తున్నాయి. ఎలాంటి ముందస్తు భద్రతా ప్రమాణాలు లేకుండా మానవ జీవితాలతో జూదం ఆడుతున్నాయి" అని ఆయన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అనుమతి లేని నియంత్రణ.. తీవ్ర ముప్పు
ఏఐ సిస్టమ్స్ ఒకసారి మానవ మేధస్సును దాటి స్వయంప్రతిపత్తి సాధిస్తే వాటిని నియంత్రించడం మనుషులకు సాధ్యం కాదని టెక్ నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. కాక్సన్ వ్యాఖ్యలు ఈ భయాలను మరింత బలపరిచాయి. లాభాల వేటలో పడి భద్రతా నిబంధనలను పక్కనబెడుతూ సూపర్ ఇంటెలిజెన్స్ వైపు టెక్ దిగ్గజాలు దూసుకుపోవడం వల్ల సమీప భవిష్యత్తులోనే వినాశకరమైన పరిణామాలు ఎదురవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ విప్లవం ఒకవైపు మానవ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నప్పటికీ మరోవైపు దాన్ని అభివృద్ధి చేస్తున్న టాప్ రీసెర్చర్లే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలతో బయటకు వచ్చి రాజీనామా చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. టెక్ నియంత్రణలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
