ఇంటిని ఖాళీ చేయని వైనంపై మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
అలాంటి పెద్ద మనిషికి నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయినప్పటికీ.. రెండు రోజుల క్రితం ఆయనపై కేంద్రానికి సుప్రీంకోర్టు రాసిన లేఖ బయటకు వచ్చి సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 8 July 2025 10:00 AM ISTఆయన సాదాసీదా వ్యక్తి కాదు. దేశంలోనే అత్యున్న న్యాయస్థానం సుప్రీకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన ఆయన. అలాంటి పెద్ద మనిషికి నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయినప్పటికీ.. రెండు రోజుల క్రితం ఆయనపై కేంద్రానికి సుప్రీంకోర్టు రాసిన లేఖ బయటకు వచ్చి సంచలనంగా మారింది. పెద్ద చర్చకు తెర తీసింది. అవును.. ఇదంతా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురించే.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన ఆయన కొంతకాలం క్రితం పదవీ విరమణ చేయటం తెలిసిందే. అధికారిక నిబంధనల ప్రకారం రిటైర్ అయిన ఆర్నెల్ల వ్యవధిలో ప్రభుత్వం తనకుకేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.కానీ..ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించారని.. ఆయన అధికారిక బంగ్లాలో ఉండటంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆయనఅధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన వైనం సంచలనంగా మారింది.
ప్రస్తుతం జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలోని క్రిష్ణ మీనన్ మార్గ్ లోని 5వ నంబరు బంగ్లాలో నివాసం ఉంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిబంధనలు, 2022 రూల్ నెంబరు 3బీ ప్రకారం.. పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని గరిష్ఠంగా ఆర్నెల్లు కొనసాగే వీలుంది. తాజా పరిణామాలపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. మరో రెండు రోజులు లేదంటే గరిష్ఠంగా మరో 2 వారాల్లో తాను భవనాన్ని ఖాళీ చేస్తానని పేర్కొన్నారు.
త్వరలోనే అద్దె ప్రాతిపదికన మరో ప్రభుత్వ భవనంలోకి మారనున్నట్లుగా పేర్కొన్నారు. కొత్త ఇల్లు సిద్ధమైందని.. తనకున్న కుటుంబ సమస్యల కారణంగానే ఇంటిని ఖాళీ చేయలేదన్నారు. తన ఇద్దరు కుమార్తెలు (ప్రియాంక, మహి)నెమలీన్ మయోపతీ అనే కండర సంబంధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారని.. వారికి కొన్ని ప్రత్యేక వైద్య సంబంధ అవసరాలు ఉన్న కారణంగానే.. ఇంట్లో ఉండాల్సి వచ్చిందన్నారు. రిటైర్ అయిన తర్వాత అదనపు కాలం ఉన్నది తానొక్కడే కాదని.. గతంలోనూ కొందరికి ఆ సదుపాయం కల్పించారని గుర్తు చేశారు. ఏమైనా.. ఇలాంటి అంశాల్లో మాట అనిపించుకునే అవకాశాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఇవ్వకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
