34 ఏళ్ల క్రితం రూ.లక్ష.. ఇప్పుడు మీ ఊహకు కూడా అందదంతే
అదృష్టం ఉండాలే కానీ అదే రూపంలో వచ్చి తలుపు తడుతుందో చెప్పలేమనటానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పాలి.
By: Tupaki Desk | 9 Jun 2025 1:00 PM ISTఅదృష్టం ఉండాలే కానీ అదే రూపంలో వచ్చి తలుపు తడుతుందో చెప్పలేమనటానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పాలి. అప్పుడెప్పుడో 34 ఏళ్ల క్రితం రూ.లక్ష మొత్తాన్ని షేర్లలో పెట్టుబడి పెట్టి.. ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. కట్ చేస్తే.. తాజాగా అతడి కుమారుడు ఆ విషయాన్ని గుర్తించాడు. ఈ సందర్భంగా తన తండ్రి కొన్న షేర్ల విలువ ఊహకు అందని రీతిలో పెరిగిపోయిన వైనం ఆసక్తికరంగా మారింది.
సదరు వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? లాంటి వివరాలు తెలీవు కానీ.. ఆన్ లైన్ లో సౌరవ్ దత్తా అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఈ ఉదంతం వైరల్ గా మారింది. ఆయన పెట్టిన పోస్టు ప్రకారం చూస్తే.. 1990లో ఒక వ్యక్తి రూ.లక్షతో జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన పత్రాల్ని (అప్పట్లో హార్డ్ కాపీలే తప్పించి.. ఇప్పటి మాదిరి ఆన్ లైన్ వసతి ఉండేది కాదు) ఒక పక్కన పెట్టేసి మర్చిపోయారు.
ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోలేదు. తాజాగా ఆయన కొడుకు ఈ షేర్ల పత్రాల్ని గుర్తించాడు. వాటి విలువను అంచనా వేసే ప్రయత్నం చేసి ఆశ్చర్యపోయాడు దీనికి కారణం.. 34 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్ల విలువ ఏ పది లక్షలో.. ఇరవై లక్షలో కాదు కదా.. కోటి కూడా కాదు. ఊహకు అందనంత భారీగా పెరిగిపోయింది.
ఇంతకూ ఎంతకు అంటారా? అక్కడికే వస్తున్నాం? రూ.లక్షతో కొన్న షేర్ల విలువ ఇప్పుడు ఏకంగా రూ.80 కోట్లకు చేరిపోయింది. దీంతో.. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే ఫలితం ఎలా ఉంటుందన్న దానికి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు. అలా అని.. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ప్రతి దానికి ఇలానే విలువ పెరుగుతుందని ఇక్కడ చెప్పటం లేదు.కాకుంటే.. ఒక ఆసక్తికర ఉదాహరణగా మాత్రం చెప్పక తప్పదు.
