Begin typing your search above and press return to search.

భారతీయ విద్యార్థుల డాలర్స్‌ డ్రీమ్‌ నెరవేరుతోందిలా!

విదేశాల్లో చదువుకోవాలనేది దాదాపు ప్రతి ఒక్క భారతీయ విద్యార్థి కల. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందరికీ ఈ అవకాశం ఉండదు

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:47 AM GMT
భారతీయ విద్యార్థుల డాలర్స్‌ డ్రీమ్‌ నెరవేరుతోందిలా!
X

విదేశాల్లో చదువుకోవాలనేది దాదాపు ప్రతి ఒక్క భారతీయ విద్యార్థి కల. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందరికీ ఈ అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) అండగా నిలుస్తున్నాయి. ఇవి విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు భారీ ఎత్తున రుణాలను అందిస్తున్నాయి.

కరోనా విజృంభణ 2021, 2022 సంవత్సరాల్లో భారతీయుల విదేశీ విద్యకు బ్రేకులు పడ్డాయి. అయితే కరోనా సంక్షోభం ముగిసిపోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 2022లో 4,50,000 ఉండగా 2023లో వీరి సంఖ్య 7,50,000కి పెరగడమే ఇందుకు నిదర్శనం.

ఈ నేపథ్యంలో గత మూడు సంవత్సరాలతో పోలిస్తే విదేశాలలో చదువుకోవాలనే డిమాండ్‌ లో అసాధారణమైన పెరుగుదల ఏర్పడింది, ఈ క్రమంలో భారతీయ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) అందించే విద్యా రుణాలలోనూ ఐదు రెట్లు గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు గణనీయమైన వృద్ధిని సాధించగలవని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యా రుణ ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35-40% నుండి రూ.35,000 కోట్లకు పెరుగుతాయని చెబుతున్నారు. గత దశాబ్ద కాలంలో 5 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు తమ విదేశీ చదువులకు విద్యా రుణాలను తీసుకున్నారు.

ముఖ్యంగా కెనడాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 40% భారతీయులే. వీరు కెనడియన్‌ ఆర్థిక వ్యవస్థలోకి ఏటా ఏకంగా 10 బిలియన్‌ కెనడియన్‌ డాలర్లను అందిస్తున్నారు. భారత్, కెనడా మధ్య ఇటీవలి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారతీయ విద్యార్థులకు వీసా సేవల్లో అంతగా ఇబ్బందులు లేవు. ఇటీవల కెనడా ప్రవేశపెట్టిన పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌ వర్క్‌ పర్మిట్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రోగ్రామ్‌ భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తోంది.

మరోవైపు విదేశాలకు వెళ్లే భారతీయుల్లో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు మంజూరు చేయబడిన విద్యార్థి వీసాల శాతం 2015లో 14.6% ఉండగా 2023లో ఇది ఏకంగా 40%కి పెరిగింది.