అమెరికాపై విదేశీ విద్యార్థుల న్యాయపోరాటం
అయితే, విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధిత విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
By: Tupaki Desk | 16 April 2025 4:00 AM ISTఅమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల పలువురు విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేయడంతో వారు కోర్టును ఆశ్రయించారు. క్యాంపస్‌లలో జరిగిన ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థులను అమెరికా విదేశాంగశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆందోళనల్లో పాల్గొన్న వారితో పాటు, వాటికి సంబంధించిన దృశ్యాలు, జాతి వ్యతిరేక వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని కూడా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలని అధికారులు తొలుత ఈమెయిల్స్ ద్వారా సూచించారు. ఆ తర్వాత ట్రంప్ ప్రభుత్వం పలు విశ్వవిద్యాలయాల విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. దీనితో ఎంతోమంది విదేశీ విద్యార్థులు బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు.
అయితే, విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధిత విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ వీసాలను అకస్మాత్తుగా రద్దు చేయడంతో చదువు కొనసాగించడం కష్టంగా మారిందని, తమ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో పాటు మేరీల్యాండ్, ఒహియో స్టేట్ వంటి ప్రముఖ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు.
చట్టబద్ధమైన పత్రాలు లేని విద్యార్థులను, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలుపుతున్న విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, నిరసన కార్యక్రమాలలో పాల్గొనని విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయని కళాశాలల వర్గాలు పేర్కొంటున్నాయి. కొందరు విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీసా రద్దు చేశారని చెబుతుండగా, మరికొందరి విషయంలో అధికారులు సరైన కారణం కూడా చెప్పడం లేదని విద్యార్థులు కోర్టుకు విన్నవించారు. ఇటువంటి చిన్న కారణాలతో తమ వీసాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వారు వాదిస్తున్నారు.
మొత్తానికి, అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసా రద్దు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతుండగా, అమెరికా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
