Begin typing your search above and press return to search.

వందే భారత్‌ రైళ్లలో 6 నెలలు వాటిపై నిషేధం!

ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే శాఖ బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్‌ డ్రింక్స్, లా కార్టే ఐటెమ్స్‌ వంటి వాటిని బ్యాన్‌ చేసింది. వీటిని ఆరు నెలలు పాటు నిషేధించింది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 2:31 PM GMT
వందే భారత్‌ రైళ్లలో 6 నెలలు వాటిపై నిషేధం!
X

దేశంలో ప్రయాణ దూరాన్ని తగ్గించడానికి, ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలు చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ పేరుతో వేగవంతమైన రైళ్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గంటకు 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఇవి ప్రయాణిస్తాయి.

ఇప్పటివరకు దేశంలో వివిధ నగరాల మధ్య 26 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. సెప్టెంబర్‌ 24న ఒక్కరోజే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లను వర్చువల్‌ గా ప్రారంభించారు. వీటిలో విజయవాడ – చెన్నై మధ్య ప్రయాణించే రైలు కూడా ఉంది. అలాగే కాచిగూడ – యశ్వంత్‌ పూర్‌ మధ్య ప్రయాణించే రైలు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ కు మొత్తం మూడు వందే భారత్‌ రైళ్లు దక్కాయి.

ప్రయాణాలు వేగంగా సాగుతుండటంతో చాలామంది దూరప్రయాణాలు చేసేవారు కూడా వందే భారత్‌ లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. సాధారణ, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లతో పోలిస్తే చార్జీలు ఎక్కువ ఉన్నా ప్రయాణికులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో వందే భారత్‌ రైళ్లకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్యాసింజర్ల ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా కొన్ని మార్పులు చేపట్టారు.

వందే భారత్‌ ట్రైన్లలో లంచ్‌ లేదా డిన్నర్‌ ఆర్డర్‌ చేసే ప్రయాణికులకు మెనూలో లేని పదార్థాలు కూడా విక్రయిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. అలాగే ఫుడ్‌ ఐటమ్‌ కవర్లను కొందరు కోచ్‌ లోనే పడేస్తుండటంతో అపరిశుభ్రత ఏర్పడుతోందని తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇది తమకు ఇబ్బంది కలిగిస్తోందని వెల్లడించారు.

ఫుడ్‌ కవర్లు కోచ్‌లో ఉండటం వల్ల.. కొన్ని సార్లు ఆటోమాటిక్‌ డోర్లు ఓపెన్‌ అవుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆ వ్యర్దాల వల్ల కోచ్‌ లలో దుర్వాసన కూడా వ్యాపిస్తోందని ప్రయాణికులు ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చారు.

ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే శాఖ బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్‌ డ్రింక్స్, లా కార్టే ఐటెమ్స్‌ వంటి వాటిని బ్యాన్‌ చేసింది. వీటిని ఆరు నెలలు పాటు నిషేధించింది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కారణాల వల్ల ఆయా ఫుడ్‌ ఐటెమ్స్‌ ను నిషేధిస్తున్నట్టు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఇప్పటి వరకు వందే భారత్‌ రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే విషయం మీద కూడా కొంత గందరగోళం ఉంది. అయితే ఇకపై టికెట్‌ బుక్‌ చేసుకునేటప్పుడు బుకింగ్‌ సమయంలోనే వివరాలు వస్తాయి. ప్రయాణానికి ముందు రీకన్ఫర్మేషన్‌ క్యాటరింగ్‌ సర్వీస్‌ వివరాలు ప్రయాణికులకు మెసేజ్‌ రూపంలో కనిపిస్తాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి. తమకు ఇష్టముంటే ఆ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. లేదా వాటిని తిరస్కరించే ఆప్షన్‌ ఉంటుంది.