కుటుంబం కోసం కష్టపడుతున్న చెవిటి–మూగ డెలివరీ బాయ్ కథ
మాటలతో తన భావాలను చెప్పలేకపోయినా, చెవులు వినకపోయినా బాధ్యతలను వదిలిపెట్టకుండా కృషి చేస్తున్న ఓ యువకుడు నెట్టింట ప్రజల హృదయాలను తాకాడు.
By: A.N.Kumar | 29 Sept 2025 1:40 AM ISTమాటలతో తన భావాలను చెప్పలేకపోయినా, చెవులు వినకపోయినా బాధ్యతలను వదిలిపెట్టకుండా కృషి చేస్తున్న ఓ యువకుడు నెట్టింట ప్రజల హృదయాలను తాకాడు. ఫుడ్ డెలివరీ భాగస్వామిగా పని చేస్తున్న ఈ వ్యక్తి తన పరిస్థితిని కస్టమర్‌కు తెలియజేస్తూ పంపిన ఒక సరళమైన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.“నేను మీ ఆర్డర్‌ను తీసుకున్నాను. మరికాసేపట్లో డెలివరీ చేస్తాను. నేను మాట్లాడలేను, వినలేను. అడ్రెస్ వద్దకు వచ్చాక మెసేజ్ చేస్తాను. దయచేసి చూడండి.”
ఈ చిన్న సందేశం వెనుక దాగి ఉన్న పట్టుదల, కష్టపడి జీవించాలనే నిజాయితీ నెట్టిజన్లను లోతుగా ఆలోచింపజేసింది. కొద్ది గంటల్లోనే ఆ పోస్ట్‌కు తొమ్మిది లక్షలకు పైగా వ్యూస్ రావటం, ఎంతమంది హృదయాలను తాకిందో చెప్పకనే చెబుతుంది.
శారీరక సమస్యలు ఉన్నా, వాటిని సాకుగా చూపకుండా, యువకుడు తన పనిని అత్యంత బాధ్యతతో నిర్వహిస్తున్న తీరు అభినందనీయం. "నేను మాట్లాడలేను, వినలేను" అని కస్టమర్‌కు ముందే తెలియజేస్తూ పంపిన ఆ చిన్న సందేశం, అతని యొక్క పారదర్శకతను.. వృత్తి పట్ల అతనికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. కస్టమర్లలో గందరగోళం లేకుండా, ఆర్డర్ డెలివరీ ప్రక్రియ సజావుగా సాగేలా చూసుకోవాలనే అతని ప్రయత్నం అతని నిజాయితీకి నిదర్శనం.
నెటిజన్ల హృదయాలను తాకిన మానవత్వం
ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది సామాజిక స్పృహ ఎంత బలంగా ఉందో తెలుపుతుంది. నెటిజన్లు కేవలం 'వ్యూస్' ఇవ్వడం కాకుండా, అతని కష్టాన్ని గుర్తించి, మెచ్చుకున్నారు. 'టిప్' ఇచ్చి ప్రోత్సహించాలి అనే వ్యాఖ్య, ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకునే సానుభూతి.. సహాయక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. సమస్యలు ఉన్నా వాటిని దాటవే యకుండా కష్టపడి జీవించాలనే అతని తపన, నిరాశలో ఉన్న ఎంతో మందికి ఒక గొప్ప సందేశంగా మారింది.
నేటి యువతకు స్ఫూర్తి
డెలివరీ బాయ్ తన శారీరక పరిమితులను అడ్డంకిగా కాకుండా, సవాలుగా మార్చుకున్నాడు. ఈ కథ నేటి యువతకు, ముఖ్యంగా చిన్నపాటి కష్టాలకు కూడా నిరుత్సాహపడే వారికి, ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. 'క్రమశిక్షణతో, విశ్వాసంతో పనిచేస్తే మార్గం సొంతమవుతుంది' అనే జీవన సత్యాన్ని ఈ యువకుడు తన చర్యల ద్వారా నిరూపించాడు.
ఈ కథనం ఆహారం డెలివరీ చేసే ఒక యువకుని గురించి మాత్రమే కాదు, జీవన పోరాటంలో నిశ్శబ్దంగా పోరాడుతున్న ఎంతో మంది అదృశ్య కార్మికుల పరాకాష్ఠ. అతని కృషి, పట్టుదల, ఆత్మగౌరవం... ఈ మూడు అంశాలు కలిసే ఈ కథను అసాధారణమైనదిగా చేశాయి. ఇది కేవలం ఒక డెలివరీ కాక, మంచి మనసు, శ్రమ యొక్క డెలివరీగా భావించవచ్చు.
