ఎగిరే రోబోపై ట్రోలింగ్... అసలు విషయం తెలియక అనవసర కామెంట్స్!
అవును... ఇటలీకి చెందిన పరిశోధకులు ప్రపంచంలోనే తొలిసారి ఎగిరే రోబోను అభివృద్ధి చేశారు
By: Tupaki Desk | 2 July 2025 8:00 AM ISTఇటీవల కాలంలో ట్రోలింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. అయితే.. ఈ విషయంలో కొంతమంది విజ్ఞత మరిచి, సంస్కారం విడిచి ట్రోల్స్ చేస్తే.. మరికొంతమంది ఉన్నంతంలో కాస్త సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుని చేస్తుంటారు! ఈ సమయంలో తాజాగా ఓ రోబో ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాని వెనకున్న టెక్నాలజీని వదిలి.. రూపంపై కామెంట్ చేస్తున్నారు.
అవును... ఇటలీకి చెందిన పరిశోధకులు ప్రపంచంలోనే తొలిసారి ఎగిరే రోబోను అభివృద్ధి చేశారు. 'ఐరన్ కబ్ ఎంకే3' (iRonCub MK3) పేరిట ఇటాలియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. మనిషి ఆకారంలో లో ఉన్న ఈ రోబోను రూపొందించింది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ యూట్యూబ్ వేదికగా తాజాగా పంచుకుంది. అయితే.. ఈ రోబో ఆకారంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
వాస్తవానికి ఇది టేకాఫ్ చేయడానికి రూపొందించబడిన మొట్టమొదటి జెట్ పవర్ తో పనిచేసే ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ అని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఇటాలియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు.. ఇది దీనిని ప్రదర్శన కోసం తయారు చేయలేదని.. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా తీర్చిదిద్దామని వెల్లడించారు.
ఇదే సమయంలో... దానికున్న ఎగిరే లక్షణం కారణంగా.. మనుషులు వెళ్లడానికి వీలులేని అత్యంత క్లిష్టమైన ప్రదేశాల్లోకి అది చేరుకుంటుందని చెప్పారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు, అలాగే వాటిని తొలగించడంలోనూ ఉపకరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిపిన పరీక్షల్లో ఇది సానుకూల ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
3 అడుగుల ఎత్తు, 22 కిలోల బరువు ఉన్న ఈ రోబోట్.. జెట్ థ్రస్టర్ల సాయంతో నేలపై నుంచి 20 అంగుళాల మేర ఎగరగలదు. అయితే.. దీనికి బేబీ ఫేస్ అమర్చడంతో ఒక చిన్నారిలా కనిపిస్తోంది. ఈ సమయంలో... దాని ఫేస్ కట్, సైజ్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఆ ముఖాకృతి వింతగా కనిపిస్తోందని నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఇందులో భాగంగా... అది రాక్షస శిశువులా ఎందుకు కనిపించాలి? అని ఒకరంటే.. చిన్న పిల్లల ముఖంతో పెద్ద పనులా అని ఇంకొకరు స్పందించారు. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో... దాని వెనక ఉన్న టెక్నాలజీని, గొప్ప ఉద్దేశాన్ని వదిలేసి.. ఇలా రూపం గురించి మాట్లాడటాన్ని మించిన అజ్ఞానం మరొకటి ఉంటుందా అంటూ వారిపై సెటైర్లు వేస్తున్నారు మరికొందరు.
