ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరు మృతి
కాల్పుల సంస్క్రతి అగ్రరాజ్యంలో ఎంత ఎక్కువన్న విషయం తెలిసిందే. గన్ కల్చర్ కారణంగా అమాయకులు తరచూ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.
By: Tupaki Desk | 18 April 2025 10:10 AM ISTకాల్పుల సంస్క్రతి అగ్రరాజ్యంలో ఎంత ఎక్కువన్న విషయం తెలిసిందే. గన్ కల్చర్ కారణంగా అమాయకులు తరచూ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. తాజాగా అలాంటి విషాద ఉదంతమే ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఒక సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. గాయాల బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ కాల్పులకు కారణం.. వర్సిటీకి చెందిన విద్యార్థా? బయటవారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాల్పులకు తెగబడిన దుండగుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలోని తల్లహస్సి క్యాంపస్ లో ఒక యాక్టివ్ షూటర్ ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే.. వర్సిటీ వర్గాలను అలెర్టు చేవారు. దీంతో.. విద్యార్థులు.. సిబ్బంది.. అధ్యాపకులు వెంటనే వర్సిటీని వీడాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో.. వర్సిటీలోని అన్నికార్యక్రమాల్ని రద్దు చేశారు.
ఇదిలా ఉండగా.. కాల్పులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టటంతో పాటు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్యాంపస్ లో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒక యువకుడు కాల్పులు జరుపుతున్న ఫుటేజ్ ఒకటి వెలుగుచూసింది. అయితే.. నిందితుడు వర్సిటీ విద్యార్థా?కాదా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఈ ఉదంతంపై దేశాధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇదో భయంకరమైన సంఘటనగా అభివర్ణించారు. కాల్పులకు తెగబడటం వెనుక అసలు కారణం ఏమిటన్న విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది.
