రాముడి లీలేనా? గంగలో 3 క్వింటాళ్ల రాయి తేలియాడింది!
గంగా నదిలో ఓ భారీ రాయి తేలుతూ కనిపించడం స్థానికులు, భక్తుల ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది యూపీలోని ఘాజీపుర్ జిల్లాలో చోటు చేసుకుంది..
By: Tupaki Desk | 19 July 2025 3:42 PM ISTగంగా నదిలో ఓ భారీ రాయి తేలుతూ కనిపించడం స్థానికులు, భక్తుల ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది యూపీలోని ఘాజీపుర్ జిల్లాలో చోటు చేసుకుంది.. సాధారణంగా రాయి నీటిలో మునిగిపోతుంది. కానీ ఈ రాయి అలా తేలుతూ ఉండటంతో అనేక ఊహాగానాలు, ఆధ్యాత్మిక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాయి బరువు సుమారు 2.5 నుండి 3 క్వింటాళ్లు (దాదాపు 250-300 కిలోలు) ఉందని అంటున్నారు. అయితే, అంత బరువు ఉన్నా కూడా అది గంగానదిలో మునగకపోవడం భక్తుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్కడి భక్తులు తాళ్లతో ఆ రాయిని ఒడ్డుకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. పలువురు దీన్ని ఒక దివ్య చిహ్నంగా భావించి, గంగామాత ఆశీస్సుగా తీసుకుంటున్నారు.
- రామసేతు రాళ్లతో పోలిక?
ఈ రాయి రామాయణంలో పేర్కొన్న రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను తలపిస్తోందని కొందరు విశ్వాసంతో ఉన్నారు. అప్పట్లో హనుమాన్, వానర సేన రాముని ఆజ్ఞపై సముద్రంపై రామసేతు నిర్మించినప్పుడు, రాముని నామాన్ని రాయిపై రాస్తే అది నీటిలో తేలేది అని పురాణ కథనం. ఇప్పుడు గంగానదిలో కనిపించిన ఈ రాయి కూడా అలాంటి క్రమానికి చెందినదేమోనని పలువురు భావిస్తున్నారు.
- పరిశోధన అవసరం
ఇది ప్రాకృతిక శక్తుల ప్రభావం, లేక ప్రాచీన శిల్ప పరిజ్ఞానానికి చెందిన రాయి అనే దానిపై స్పష్టత రావాలంటే శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భౌతిక శాస్త్రజ్ఞులు, పురావస్తు నిపుణులు దీనిపై పరిశోధన చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ రాయిని గంగా నీటిలో తేలియాడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి. వేలాది మంది వీటిని షేర్ చేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఈ ఘటనను దేవుని సంకేతంగా చూస్తుండగా మరికొందరు శాస్త్రీయంగా దీనికి ఆధారాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ రాయి ఒక అపురూపమైన శిలా ఖండమా? లేక పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన రామసేతు రాయిలో భాగమా? ఇది భక్తుల నమ్మకమా, లేక శాస్త్రీయంగా విచారించాల్సిన అంశమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ, ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
