Begin typing your search above and press return to search.

ఒక్కో లోక్‌ సభ సీటుకు ఐదుగురి పేర్లు!

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 17 లోక్‌ సభా స్థానాల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 1:30 AM GMT
ఒక్కో లోక్‌ సభ సీటుకు ఐదుగురి పేర్లు!
X

తెలంగాణలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లను దక్కించుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. వచ్చేసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఎంపీల వరకు ఢంకా బజాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 17 లోక్‌ సభా స్థానాల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో ఒక్కో లోక్‌ సభ స్థానం నుంచి ఐదుగురు చొప్పున ఆశావహుల పేర్లను బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపాలని తెలంగాణ పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో లోక్‌ సభా స్థానానికి ఐదుగురి పేర్లను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. త్వరలో బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ముందే అభ్యర్థుల వివరాలను అధిష్టానానికి పంపాలని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేస్తోంది.

అభ్యర్థుల ఎంపికలో వివిధ సర్వేలు, సామాజిక సమీకరణలతో పాటు, పార్టీ స్థానిక నాయకత్వాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో లోక్‌ సభ ఎన్నికల సన్నద్ధతపై ఫిబ్రవరి 12న బీజేపీ రాష్ట్ర కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ నేతలు వేర్వేరుగా సమావేశమై కార్యాచరణపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో తెలంగాణ క్షేత్ర స్థాయిలో రాజకీయ ఎన్నికల పరిస్థితులపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక, బలాబలాలు, సామాజిక సమీకరణాలపై లోతుగా చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కీలకమని, సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ మొదటి సమావేశం నాటికి పేర్లు పంపితే చాలావరకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉందని నిర్ణయించారు. తెలంగాణ లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.

రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా బస్సు యాత్ర చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. పార్టీ మేనిఫెస్టో, ఈ నెల 20 నుంచి 29 వరకు చేపట్టబోయే రథయాత్ర తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన 35 కమిటీలు నిర్దేశించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.