తమిళనాడు బెంగాల్ ఎన్నికలకు ఈసీ ముహూర్తం
దేశంలో మరో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు తొందరలో జరగనున్నాయి. ఒక విధంగా ఇది మినీ ఎన్నికల సమరంగానే ఉండబోతోంది.
By: Satya P | 17 Feb 2026 11:48 PM ISTదేశంలో మరో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు తొందరలో జరగనున్నాయి. ఒక విధంగా ఇది మినీ ఎన్నికల సమరంగానే ఉండబోతోంది. మొత్తం 125 ఎంపీ సీట్ల పరిధిలోని రాష్ట్రాలుగా ఇవి ఉన్నాయి. అంటే పార్లమెంట్ లో అయిదవ వంతు అన్న మాట. ఇక ఈ రాష్ట్రాలలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపి దాదాపుగా అయిదు వందల వరకూ ఉండనున్నాయి. దాంతో పాటు ఇండియా కూటమి కీలక నేతలు బిగ్ షాట్స్ అనదగిన సీఎంలు ముగ్గురు పాలిస్తున్న రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్ లో మమతా బెనర్జీ నాల్గవసారి అధికారం కోసం భీకర పోరుకు సిద్ధపడుతుండగా తమిళనాడులో స్టాలిన్ వరసగా రెండోసారి గెలవాలని చూస్తున్నారు. కేరళలలో లెఫ్ట్ పార్టీల సారధి పినరయి విజయన్ హ్యాట్రిక్ కొట్టాలని ఉత్సాపడుతున్నారు. వీటితో పాటు జరిగే అసోంలో బీజేపీ రెండోసారి అధికారం అందిపుచ్చుకునేందుకు చూస్తోంది. పుదుచ్చేరిలో సైతం ఇండియా కూటమి ప్రభుత్వమే ఉంది.
ఏప్రిల్ లో ఎన్నికలు :
ఇక ఈ అయిదు రాష్ట్రాలలో ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఈసీ వర్గాలు తాజాగా వెల్లడించడం విశేషం. వీటికి సంబంధించిన షెడ్యూల్ ని మార్చి నెల మధ్యలో విడుదల చేస్తారు అని అంటున్నారు. ఇక ఎన్నికలకు ఆయా రాష్ట్రాలు ఏ మేరకు సన్నద్ధంగా ఉన్నాయో పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం అధికారులు పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం అస్సాంలో ఎన్నికల బృందం పర్యటిస్తోంది.
పదవీ కాలం చూస్తే :
ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు కేరళ, అస్సాం ప్రభుత్వాల పదవీ కాలం మే నెలతో ముగుస్తోంది. పుదుచ్చేరిలో పాలనకు జూన్ వరకూ గడువు ఉంది. అయితే అయిదు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఈసీ కసరత్తు చేస్తోంది. ఇక ఈ రాష్ట్రాలలో ఈసీ నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ కూడా దాదాపుగా తుది దశకు చేరుకుందని అంటున్నారు. పుదుచ్చేరీలో ఓటర్ల తుది జాబితాను ఫిబర్వరి 14న ప్రచురించారు. తమిళనాడులో తుది జాబితా తాజాగా విడుదల చేస్తున్నారు. కేరళలలో ఈ నెల 21న, పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 28న విడుదల చేస్తారు అని ఈసీ వర్గాలు వెల్లడించాయి.
సమరమే :
బడ్జెట్ సెషన్ అన్నది రెండవ విడత ఏప్రిల్ 2 తో ముగియనుంది. దాంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ అయిదు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి అయితే పెద్ద ఎత్తున మొదలు కానుంది. అస్సాంలో అధికారం నిలబెట్టుకుంటూ పశ్చిమ బెంగాల్ ని గెలవాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది. తమిళనాడులో అన్నా డీఎంకేతో కలసి ప్రభుత్వంలోకి రావాలని అనుకుంటోంది. కేరళలో ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలన్నది టార్గెట్. అలాగే పుదుచ్చేరీలో కూడా ఉనికి చాటుకోవాలని ప్రయత్నంగా ఉంది. ఇక స్టాలిన్, మమతా పినరయ్ విజయన్ ఈ ముగ్గురూ రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న వారు. దాంతో భీకరమైన సమరానికి తెర లేవనుందని అంటున్నారు.
