Begin typing your search above and press return to search.

రేపే ప్రకటన..?! ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోందోచ్

అదేవిధంగా అస్సాంలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఒకే విడతలో పూర్తయ్యాయి. ఈ సారి కూడా ఈ రాష్ట్రాల్లో మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   15 March 2026 12:49 PM IST
రేపే ప్రకటన..?! ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోందోచ్
X

దేశంలో మరో మినీ సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన చేసేందుకు సర్వం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారమే షెడ్యూల్ విడులయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరి మినహా మిగిలిన నాలుగు ప్రధాన రాష్ట్రాలు. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. అదేసమయంలో అస్సాంలో తప్ప మిగిలిన మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీయేతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. దీంతో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర హోంశాఖతో ఎన్నికల కమిషన్ చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయిందని అంటున్నారు. ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపైన తుది నిర్ణయానికి రావాల్సివుందని అంటున్నారు. గతంలో పశ్చిమబెంగాల్ లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. అయితే ఇప్పుడు 6 విడతలకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనను ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని చెబుతున్నారు.

అదేవిధంగా అస్సాంలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఒకే విడతలో పూర్తయ్యాయి. ఈ సారి కూడా ఈ రాష్ట్రాల్లో మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. బందోబస్తుకు సిబ్బంది అందుబాటులో ఉంటే తమిళనాడులో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఇక షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పెండింగ్ లో ఉన్న జీవోల విడుదలకు ఆదివారం కూడా పనిచేస్తున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత జీవోల విడుదలకు ఆంక్షలు అడ్డంకి అయ్యే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వాలు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు.

ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మూడు చోట్ల బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయా ప్రభుత్వాధినేతలు సైతం బలంగా పోరాడుతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకోడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పశ్చిమబెంగాల్ లో సీఎం మమతా బెనర్జీకి దీటుగా బీజేపీ రాజకీయాలు నడుపుతోంది. ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టుల స్థానాన్ని ఐదేళ్ల క్రితం ఆక్రమించిన బీజేపీ ఇప్పుడు మమతను గద్దె దించే దిశగా పావులు కదుపుతోంది. అదేసమయంలో తమిళనాడులో కూడా తొలిసారిగా అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటోంది. కేరళలో ఒంటరి పోరాటమే చేస్తున్నా, ఆ రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్యే పోటీ కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి బీజేపీ వర్సెస్ ఇండి కూటమి రాజకీయాలు ఈ ఎన్నికలతో మరోసారి తారాస్థాయికి చేరే అవకాశం ఉందని అంటున్నారు.