Begin typing your search above and press return to search.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ ఫైనల్ డెసిషన్ ఇదేనా?

ప్రస్తుతం గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును డంప్ చేసి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది!

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:02 AM GMT
కాళేశ్వరం ప్రాజెక్ట్  పై రేవంత్  సర్కార్  ఫైనల్  డెసిషన్  ఇదేనా?
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో అవకతవకలు జరిగాయని, ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ నేతలు దుబ్బయట్టారు. ఈ విషయంపై అసెంబ్లీలోనూ వాడీ వేడిగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శన అనంతరం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తుందని తెలుస్తుంది!

అవును... గత సర్కారు అవినీతి వల్లే కాళేశ్వరం ఇలా తయారైందని.. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం లేదని.. ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్‌ ‌ ఎంక్వైరీ జరిపిస్తామని తాజాగా ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రుల బృందం ఈ విషయాలపై తీవ్రస్థాయిలో మండి పడింది.

ఈ సమయంలో కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలకు భారీ నష్టం వాటిల్లిందని.. ప్రస్తుతం గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును డంప్ చేసి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది! ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ బృందం.. మీడియా ప్రతినిధుల బృందంతో కలిసి కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించాయి. ఈ సందర్భంగా కాళేశ్వరం బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి ఉత్తం కుమర్ రెడ్డి తెలిపారు.

ఇదే సమయంలో... ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1.27 లక్షల కోట్లు కాగా.. ఇంకా ఎంత ఖర్చవుతుందో తెలియదని.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై ఏడాదికి రూ.15 వేల కోట్ల ఆర్థిక భారం పడుతుందని.. ఇప్పటికే నీటిపారుదల శాఖ వద్ద కోటి బిల్లులు పెండింగ్‌ లో ఉన్నాయని తెలిపారు.

ఇదే క్రమంలో... కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన మూడేళ్లలోపే కుప్పకూలడం చాలా సిగ్గుచేటని.. ఉత్తం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటివరకు రూ.95 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 97 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చారని.. అంటే ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చేందుకు కోటి రూపాయల చొప్పున ఖర్చు చేసిన ఘనత గత ప్రభుత్వానిదని మండిపడ్డారు.

మరోవైపు ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై 108 పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ తో పాటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు జరిగిన నష్టాలను సవివరంగా వివరించారు. దీంతో... కాళేశ్వరం ప్రాజెక్టును డంప్ చేసి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!!