వేల కోట్ల ఆస్తి.. క్యాబ్ డ్రైవరుగా పని! ఇదో శ్రీమంతుడి స్టోరీ
డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బును మంచి పనుల కోసం ఉపయోగించి, మన మూలాలను, సొంత ఊరిని గౌరవించడం గొప్ప.
By: Tupaki Desk | 5 Nov 2025 3:00 AM ISTడబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బును మంచి పనుల కోసం ఉపయోగించి, మన మూలాలను, సొంత ఊరిని గౌరవించడం గొప్ప. మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన శ్రీమంతుడు సినిమా సారాంశం ఇదే. వేల కోట్ల ఆస్తి ఉన్న మహేశ్ బాబు తన తండ్రి సొంత గ్రామ అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తాడు. ఈ రీల్ కథానాయకుడి స్టోరీలాంటిదే ఒక రియల్ శ్రీమంతుడి కథ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడో ఫిజీ దేశానికి వలసవెళ్లిన ఓ ప్రవాస భారతీయుడు తన మూలాలు ఉన్న భారత్ లో పేద బాలికలను చదవిస్తున్నాడు. క్యాబ్ నడుపుతూ వచ్చిన డబ్బును భారత్ కు పంపి ఏటా 24 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. అలాగని ఆయన క్యాబ్ డ్రైవర్ కాదు.. వేల కోట్ల ఆస్తిపరుడు. కానీ, ఆయన క్యాబ్ నడపడం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది.
ఫిజీకి చెందిన ఓ వ్యాపారవేత్త (పేరు బయటపెట్టలేదు) క్యాబ్ నడుపుతున్న విషయాన్ని భారత్ కు చెందిన నవ్ షా అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సుమారు రూ.1500 కోట్ల టర్నోవర్ ఉన్న ఫిజీ టైమ్స్ అనే మీడియా సంస్థతోపాటు నగల దుకాణాలు, రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. ఆయన పూర్వీకులు ఎప్పుడో భారత్ నుంచి ఫిజీ వలస వెళ్లగా, సదరు వ్యాపార వేత్త తండ్రి మొదలుపెట్టిన చిన్న సంస్థను ఈయన వందల కోట్లకు విస్తరించాడట. అయితే తన తండ్రి జన్మస్థానమైన ఇండియాకు ఏదో విధంగా సేవ చేయాలనే ఆలోచనతో ఏటా పేద బాలికలను చదవించాలని నిర్ణయించాడట.
ఇందుకోసం తన వ్యాపార సంస్థల నుంచి వచ్చిన ఆదాయం వాడటం కన్నా, తనే సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలను చేయాలని నిర్ణయించినట్లు ఆయన నవ్ షాతో చెప్పినట్లు సమాచారం. దీంతో పదేళ్లుగా రోజులో కొద్దిసేపు ఉబర్ డ్రైవరుగా పనిచేస్తూ వచ్చిన ఆదాయాన్ని భారత్ లో విద్యార్థినుల చదువుకు ఉపయోగిస్తున్నాడు. అయితే ఈ విరాళం నేరుగా ఆయన అందజేయకుండా ఇక్కడ ఓ ఎన్జీవో ద్వారా ఖర్చుచేస్తున్నట్లు నవ్ షా తన వీడియోలో తెలిపారు.
ఇక ఈ శ్రీమంతుడు తన పేరు, తాను విరాళం ఇస్తున్న ఎన్జీవో వివరాలను మాత్రం బయటపెట్టలేదు. తనకు ప్రచారం అవసరం లేదని, నిజాయితీతో తాను అనుకున్న లక్ష్యానికి చేరుకుంటే చాలని ఆయన అభిప్రాయపడినట్లు నవ్ షా తెలిపారు. అయితే భారత్ లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన బాలికలను ఫిజీ వ్యాపారవేత్త చదవిస్తున్నట్లు కొన్ని పత్రికలు రిపోర్టు చేశాయి. ఈ రియల్ శ్రీమంతుడి కథకు ఫిదా అవుతున్న నెటిజన్లు ఆయన సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
