మోడీపై ఫైట్.. ఇండియా కూటమి సీట్ల గందరగోళం !
అయితే.. ఇప్పటికి నాలుగు దఫాలుగా సమావేశం నిర్వహించినా.. ఉమ్మడి కార్యాచరణను మాత్రం ఈ కూటమి ప్రకటించలేకపోయింది.
By: Tupaki Desk | 5 Jan 2024 9:00 PM ISTకేంద్రంలో వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకుని అధికారం చేపట్టిన నరేంద్ర మోడీని గద్దె దిం పాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌కు.. సీట్ల చిక్కులు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. మోడీపై ఫైట్ ప్రకటించాక.. వివిధ రాష్ట్రాల్లోని చిన్న చితకా పార్టీలను ఏకం చేసి.. `ఇండియా` పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. అయితే.. ఇప్పటికి నాలుగు దఫాలుగా సమావేశం నిర్వహించినా.. ఉమ్మడి కార్యాచరణను మాత్రం ఈ కూటమి ప్రకటించలేకపోయింది.
అంతేకాదు.. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ విధివిధానాలు వేరుగా ఉండడం.. ఆయా రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో చేతులు కలిపినప్పటికీ ఆయా పార్టీలు ఉమ్మడి గా ముందుకు సాగే విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉన్నాయి. ప్రధానంగా సీట్ల వ్యవహారంలోనే కాంగ్రెస్‌కు చిక్కులు వస్తున్నాయి. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో గత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 421 స్థానాల్లోనే పోటీ చేసింది.
మిగిలిన స్థానాలను అప్పటి మిత్రపక్షాలకు కేటాయించింది. వీటిలోనూ కాంగ్రెస్ గెలుచుకున్నది కేవలం 52. దీంతో ప్రధాన ప్రతిపక్షం అనే హోదాను కూడా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు తెరమీదకి వచ్చింది. దీంతో ప్రాంతీయ పార్టీలు అధిక సీట్లకు గురి పెడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, యూపీ, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు ఎక్కువ స్థానాలు కేటాయించకతప్పని పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఇండియా కూటమి అడుగులు ముందుకు పడడం లేదు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ 300 స్థానాలకు తాము పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే.. దీనిపై మిత్రపక్షాల నుంచి విముఖత వ్యక్తమైంది. యూపీ, బిహార్ సహా పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా నే ఉండడంతో అన్ని సీట్లను తామే తీసుకోవడంపై కూటమి పార్టీలు పెదవి విరుస్తున్నాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ తనను తాను తగ్గించుకునే పరిస్థితికి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు 255 సీట్లకు పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే.. ఎన్నికల నాటికి ఈ సంఖ్య కూడా తగ్గుతుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి మోడీ పై ఫైట్ ఎలా ఉన్నా.. సీట్ల చిక్కులతోనే కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి గురి అవుతుండడం గమనార్హం.
