పాకిస్థాన్ లో కీలక పరిణామం.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు అపరిమిత అధికారాలు!
పాకిస్థాన్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన మార్పును తీసుకొచ్చింది.
By: Tupaki Desk | 5 Dec 2025 10:16 PM ISTపాకిస్థాన్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. కొత్తగా సృష్టించిన అత్యంత శక్తివంతమైన సైనిక పదవి పాకిస్థాన్ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ (సీడీఎఫ్)గా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ను నియమించింది. పాకిస్థాన్ దేశ చరిత్రలోనే తొలి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఈ పదవిలో ఐదేళ్లు కొనసాగుతాడు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీఓఏఎస్)గా ఏకకాలంలో చీఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా మునీర్ పనిచేస్తాడని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సీడీఎఫ్ పదవి పాక్ త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పై సర్వ అధికారాలను ఆసిమ్ మునీర్ కు దఖలు పరుస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ అణ్వాయుధాలు, క్లిపణి వ్యవస్థలను నిర్వహించే నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ పైనా ఆసిమ్ మునీర్ కు అధికారాలు అప్పగించారు. దీంతో పాకిస్థాన్ లో అత్యంత శక్తిమంతమైన సైనిక అధిపతిగా ఆసిమ్ మునీర్ ఎదిగినట్లైంది. ఇక సీడీఎఫ్ గా పనిచేసిన అధికారికి పాకిస్థాన్ అధ్యక్షుడితో సమానంగా జీవితకాలం చట్టపరమైన విచారణల నుంచి మినహాయింపు లభిస్తుంది. 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీడీఎఫ్ పదవిని గత నెలలోనే ఏర్పాటు చేశారు. గతంలో రద్దు చేసిన చైర్మన్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ స్థానంలో ఈ సీడీఎఫ్ ను పాక్ ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ సీడీఎఫ్ పదవి ద్వారా పాకిస్థాన్ ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ మొత్తం 3 సేవలు ఆసిమ్ మునీర్ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ పదవి దశాబ్దాల్లో పాకిస్థాన్ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఆసిమ్ మునీర్ ను మార్చేసిందని అంటున్నారు. ఈ సీడీఎఫ్ పదవి ఆసిమ్ మునీర్ కు నేషల్ స్ట్రాటజిక్ కమాండ్ పై పర్యవేక్షణ అధికారాన్ని కల్పించడం వల్ల భారత ఉప ఖండంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న ఆసిమ్ మునీర్ కు సర్వ అధికారాలు కట్టబెట్టడం ద్వారా పాకిస్థాన్ శాంతిని కోరుకోవడం లేదని అర్థమవుతోందని విశ్లేషిస్తున్నారు.
ఇక పాకిస్థాన్ చరిత్రలో ఐదు నక్షత్రాల ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాతోపాటు సీఓఏఎస్, సీడీఎప్ సంయుక్త కమాండ్ ను ఒకే సమయంలో నిర్వహించిన మొట్టమొదటి సైనిక అధికారిగా ఆసిమ్ మునీర్ చరిత్ర సృష్టించారు. 1965 యుద్ధ సమయంలో జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఈ ఫీల్డ్ మార్షల్ బిరుదును పొందిన రెండో ఆర్మీ అధికారి కూడా ఆసిమ్ మునీర్ కావడం గమనార్హం. ఈ కొత్త సీడీఎఫ్ నియామకం ద్వారా సైనిక అధిపతికి అసాధారణమైన చట్టపరమైన రక్షణ లభిస్తుంది. సీడీఎఫ్ అసిమ్ మునీర్‌కు దేశాధ్యక్షుడితో సమానమైన చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఈ హోదా పొందిన వారికి జీవితకాలం పాటు ఎలాంటి న్యాయపరమైన విచారణలు ఎదుర్కొకుండా మినహాయింపు లభిస్తుంది.
ఈ సవరణలు త్రివిధ దళాలపై.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే పర్యవేక్షణను కూడా తగ్గిస్తాయి. ఇకపై వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకానికి సీడీఎఫ్ సిఫార్సు చేస్తే.. దాన్ని పాక్ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. గతంలో ఈ నియామకాలు చేసే అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఇక పాకిస్తాన్ చరిత్రలో ప్రభుత్వంలో సైన్యం జోక్యం కొత్తేమీ కాదు. 1947లో పాక్ విడిపోయిననప్పటి నుంచి.. పాకిస్తాన్ పౌర, సైనిక పాలన మధ్య అధికారం దోబూచులాడుతూనే ఉంది. 1999లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న పర్వేజ్ ముషారఫ్ చివరి సైనిక పాలకుడు. అప్పటి నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక రంగాలపై సైన్యం ప్రభావం బలంగా ఉంది. దీన్ని హైబ్రిడ్ పాలన అని రాజకీయ విశ్లేషకులు పిలుస్తారు.
