Begin typing your search above and press return to search.

ఫైబర్ నెట్ లో 114 కోట్లు కొట్టేసారు...బాబు మీద మరో బాంబు

టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ అనే దాన్ని ఏర్పాటు చేసారని చివరికి అది పెద్ద స్కాం గా మారిందని, ఫలితంగా 114 కోట్లు అప్పనంగా నాటి ప్రభుత్వంలో కొట్టేశారు అని వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ ఆరోపించారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 11:58 AM GMT
ఫైబర్ నెట్ లో 114 కోట్లు కొట్టేసారు...బాబు మీద మరో బాంబు
X

టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ అనే దాన్ని ఏర్పాటు చేసారని చివరికి అది పెద్ద స్కాం గా మారిందని, ఫలితంగా 114 కోట్లు అప్పనంగా నాటి ప్రభుత్వంలో కొట్టేశారు అని వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ ఆరోపించారు. అసెంబ్లీలో ఈ రోజు ఫైబర్ నెట్ స్కాం మీద ఆయన మాట్లాడారు. అసలు ఆ స్కాం ఎలా జరిగింది దాని మూలాలు ఏంటి అన్న దాని మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

అంతే కాదు పలు జీవోలను కూడా ఆయన సభకు చూపించారు. టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ అన్న సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టారని ఆయన విమర్శించారు. హెరిటేజ్ లో పనిచేసిన వారే టెరా సాఫ్ట్ లోనూ డైరెక్టర్లుగా పనిచేశారు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ విధంగా టెరా సాఫ్ట్ సంస్థ 330 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని చేజిక్కించుకుందన్ అన్నారు. ఇందులో ఏకంగా 114 కోట్ల రూపాయలను దోపిడీ చేశారని గుడివాడ విమర్శించారు. చంద్రబాబు తన అనుకూల వ్యక్తులకే ఫైబర్ నెట్ టెండర్లు కట్టబెట్టారని అన్నారు. ఆ తరువాత షెల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని అన్నారు.

నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో కూడా వివరంగా ఉందని అన్నారు. తక్కువ ఖరీదు చేసే లైట్ ఇంటర్ ఫేస్ యూనిట్లను పెట్టి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. పోల్ ఆక్సలరీస్ అన్నవి రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల 83 వేల 696 పోల్స్ మీదుగా వెళ్లాల్సింది రెండు లక్షల 92 వేల 317 మాత్రమే ఏర్పాటు చేశారని చెప్పారు.

ఇందులో వేయకుండా వేశామని చెప్పి ఎనిమిది కోట్ల 22 లక్షల రూపాయలను కొట్టేశారని చెప్పారు. తక్కువ గ్రేడ్ కేబుల్స్ ని వేసి పది కోట్ల రూపాయలు అందులో కొట్టారు. ఆపరేషన్ నష్టాలు అంటూ 46 కోట్ల రూపాయలు కొట్టేశారని వివరించారు. ఆప్టికల్ లైన్ అప్లిఫైర్ కోసం 20 కోట్లు, నెట్ వర్క్ ఆపరేషన్స్ అండ్ మెయింటెయినెన్స్ అన్న దాని కోసం అని చెప్పి 37 కోట్లు కొట్టేశారని అన్నారు. టోటల్ గా 114 కోట్ల రూపాయలను దోచుకున్నారని అన్నారు.

ఇక మనీ ట్రాన్స్ ఫర్ ఎలా జరిగింది అన్నది ఆయన వివరిస్తూ ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ నుంచి టెరా సాఫ్ట్ కి 254 కోట్లు వెళ్లాయని అన్నారు. ఇందులో ఫాస్ట్ లైన్ సంస్థకు 117 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. ఈ సంస్థకు ఏ రకమైన ట్రాక్ రికార్డు అనుభవం లేకుండానే ఇచ్చారని ఆరోపించారు. ఒప్పందం కుదిరిన తరువాత నెల తరువాత ఫాస్ట్ లైన్ సంస్థ వచ్చిందని అన్నారు.

ఇక షెల్ కంపెనీల పేర్లు లో ఎక్స్ వై జెడ్, నెట్ ఇండియా ఇన్ గ్రాం గా ఉన్నాయని అన్నారు. ఇలా ఈ డబ్బు అంతా మనీ ట్రాన్సర్ అయ్యారు. వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ వీరంతా వేమూరి హరి క్రిష్ణ ప్రసాద్ కి సంబంధించిన వారని, వారికి ఈ డబ్బులు వెళ్లాయని గుడివాడ ఆరోపించారు. టెరా సాఫ్ట్ వేర్ అడ్రస్ కే సృష్టించిన అన్ని కంపెనీల అడ్రస్ లు ఉన్నాయని అన్నారు. ఇలా ఫైబర్ నెట్ స్కాం లో 114 కోట్ల రూపాయలు కొట్టేశారని అన్నారు.

ఇక స్కిల్ స్కాం లో 371 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం లో మరింత సొమ్ములు కొట్టేశారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు ఇపుడు ఏమీ తెలియదు అని చెప్పడమే విడ్డూరంగా ఉందని గుడివాడ హాట్ కామెంట్స్ చేశారు.