Begin typing your search above and press return to search.

ఇదెక్కడి పితలాటకం.. ఫిరోజ్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు!!

తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారం తారాస్థాయిని అందుకుంది

By:  Tupaki Desk   |   10 April 2024 9:02 AM GMT
ఇదెక్కడి పితలాటకం.. ఫిరోజ్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు!!
X

తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీలు లోక్‌ సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, ఇంకోవైపు బీజేపీ అత్యధిక స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారం తారాస్థాయిని అందుకుంది.

కాగా బీఆర్‌ఎస్, ఎంఐఎంలు 2014 నుంచి అన ధికార మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ పరిధిని దాటి అసదుద్దీన్‌ ఓవైసీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేసీఆర్‌ పార్టీకి ఇబ్బంది లేకుండా, ముస్లింల ఓట్లు చీల్చకుండా బీఆర్‌ఎస్‌ కు అసదుద్దీన్‌ సహాయమందించారనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలయ్యాక అసదుద్దీన్‌ ఓవైసీ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతున్నారని టాక్‌ నడుస్తోంది. పాత బస్తీలో ఇటీవల జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించడం ఇందుకు నిదర్శనమంటున్నారు. అలాగే ఇటీవల ఇఫ్తార్‌ వేడుకల్లోనూ సీఎంపైన అసదుద్దీన్‌ అభినందనల జల్లు కురిపించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఫిరోజ్‌ ఖాన్‌.. ఎంఐఎం పార్టీపైన, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో తమ పార్టీకి రాజి కుదిరిందంటూ ఆయన బాంబు పేల్చారు.

అంతేకాకుండా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ను గెలిపించాలని తమ పార్టీ హైకమాండ్‌ ఉన్నట్టు ఫిరోజ్‌ ఖాన్‌ కలకలం రేపారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరిపిన అసదుద్దీన్‌.. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత 2014 నుంచి కేసీఆర్‌ తో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు.

మళ్లీ ఇన్నాళ్లకు బీఆర్‌ఎస్‌ ఓటమి పాలయ్యాక కాంగ్రెస్‌ చెంతకు అసదుద్దీన్‌ ఓవైసీ చేరుతున్నారు. తాజాగా ఫిరోజ్‌ ఖాన్‌ వ్యాఖ్యలతో ఈ విషయం తేలిందని అంటన్నారు. ఇన్నాళ్లూ ఉప్పూనిప్పుగా ఉన్న పార్టీలు మరోమారు స్నేహహస్తం చాచడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎంఐఎంతో కాంగ్రెస్‌ దోస్తీ కుదిరిందని.. అసదుద్దీన్‌ ను గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఉన్నట్టు ఫిరోజ్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా ఇదే డిసైడ్‌ చేశారని తెలిపారు. తమ కెప్టెన్‌ (సీఎం) ఏం చెప్తే అదే చేస్తామని వెల్లడించారు. వ్యక్తిగతంగా తాను అసదుద్దీన్‌ తో నేను కొట్లాడుతూనే ఉంటానని తెలిపారు. ఫిరోజ్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.