Begin typing your search above and press return to search.

నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా వీధులు.. రోజుకు 3 వేల మంది అరెస్ట్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారనే విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Jun 2025 7:42 PM IST
నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా వీధులు.. రోజుకు 3 వేల మంది అరెస్ట్
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారనే విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ఆదేశాల మేరకు అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం లాస్‌ ఏంజెలెస్‌లో ఫెడరల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులు నగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. లాస్‌ ఏంజెలెస్‌లోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్‌లో ఫెడరల్ ఏజెంట్లు ఒక దుస్తుల వ్యాపారిని అక్రమ వలసదారుడని ఆరోపిస్తూ దాడి చేశారు. ఈ దాడుల్లో అనేకమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ అధికారుల ఈ చర్యలకు వ్యతిరేకంగా లాస్‌ ఏంజెలెస్‌లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వందల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ల పైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీలు, టియర్‌ గ్యాస్ ప్రయోగించారు. పదుల సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకోవడం నిరసనకారుల్లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది. వారు వందలాది మంది లాస్ ఏంజెలెస్‌లోని ఫెడరల్ భవనం వెలుపల గుమిగూడి, హుయెర్టాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఫెడరల్ అధికారులు వారిపై పెప్పర్‌ స్ప్రేను ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

ఈ సంఘటనలపై అధికారులు స్పందిస్తూ, అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని తెలిపారు. శ్వేతసౌధ సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి రోజుకు కనీసం 3,000 మందిని అరెస్టు చేయాలని తమకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగానే లాస్‌ ఏంజెలెస్‌లో దాదాపు 44 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశామని, తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడులు, నిరసనలు ట్రంప్ ప్రభుత్వ అక్రమ వలసదారుల విధానంపై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర చర్చను, వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేస్తున్నాయి.