Begin typing your search above and press return to search.

అమెరికా రక్షణ కవచంలో భారీ రంధ్రం!.. ఎఫ్‌బీఐ చీఫ్ రహస్య సందేశాలను దొగలించిన ఇరాన్ హ్యాకర్లు..

ఈ హ్యాకింగ్ వార్తలను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) అధికారికంగా ధృవీకరించడం ఈ ఉదంతం తీవ్రతను తెలియజేస్తోంది.

By:  Tupaki Political Desk   |   28 March 2026 6:00 PM IST
అమెరికా రక్షణ కవచంలో భారీ రంధ్రం!.. ఎఫ్‌బీఐ చీఫ్ రహస్య సందేశాలను దొగలించిన ఇరాన్ హ్యాకర్లు..
X

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థగా పేరున్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ స్థాయి వ్యక్తి వ్యక్తిగత ఈమెయిల్ హ్యాక్ అవ్వడం అంటే అది అమెరికా భద్రతా వ్యవస్థకే ఒక పెను సవాల్. సాధారణంగా ఇతరుల గుట్టు కనిపెట్టే ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ సొంత ఈమెయిల్ ఇన్ బాక్స్‌నే ఇరాన్ హ్యాకర్లు రచ్చకీడ్చడం ఇప్పుడు ఇంటర్నెట్ లో పెను సంచలనం సృష్టిస్తోంది. సైబర్ సెక్యూరిటీ విషయంలో అమెరికాను ఒక ‘జోక్’లా మారుస్తామని సవాల్ చేసిన హ్యాకర్లు, అన్నంత పనీ చేసి చూపించడం గమనార్హం.

ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈమెయిల్ గల్లంతు

ప్రస్తుత ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత జీమెయిల్ ఖాతాను ఇరాన్ కు చెందిన హ్యాకర్ల బృందం విజయవంతంగా హ్యాక్ చేసినట్లు ప్రకటించింది. ఇది కేవలం ఒక ప్రకటనకే పరిమితం కాలేదు, ఆయన ఇన్ బాక్స్‌లో ఉన్న ఫొటోలు, అత్యంత రహస్య పత్రాలను వారు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతికే రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది.

బట్టబయలైన వ్యక్తిగత జీవితం

ఈ హ్యాకింగ్‌లో హ్యాకర్లు కేవలం అధికారిక విషయాలే కాకుండా, కాష్ పటేల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని బయటపెట్టారు. ఆయనకు భారతదేశంలో ఉన్న నివాసం, కుటుంబ వివరాలు, ప్రయాణ చరిత్ర వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు బహిర్గతం చేశారు. ఆయన వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు, ఆర్థిక డేటాను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఆఫీసర్ ఈమెయిల్‌ను హ్యాకర్లు ఒక ఆట ఆడుకోవడంపై ఇప్పుడు మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.

అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ధృవీకరణ

ఈ హ్యాకింగ్ వార్తలను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) అధికారికంగా ధృవీకరించడం ఈ ఉదంతం తీవ్రతను తెలియజేస్తోంది. ఒక దేశపు అత్యున్నత స్థాయి అధికారి వ్యక్తి గత సమాచారం విదేశీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడం అంటే అది జాతీయ భద్రతకు పెను ముప్పు. హ్యాకర్లు ఇప్పటికే దీనిని ఒక ఆరంభం మాత్రమేనని, అమెరికా సైబర్ భద్రతను అభాసుపాలు చేస్తామని హెచ్చరించడం భవిష్యత్తులో మరిన్ని దాడులకు సూచనగా కనిపిస్తోంది.

సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, హ్యాకర్ల వ్యూహాలు అంతకంటే వేగంగా మారుతున్నాయని ఈ ఘటన నిరూపిస్తోంది. కాష్ పటేల్ వంటి కీలక వ్యక్తులు వ్యక్తి గత మెయిల్స్ వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం ఒక గుణపాఠం. ఇరాన్ హ్యాకర్ల తదుపరి లక్ష్యం ఎవరనేది ఇప్పుడు అమెరికా యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. సైబర్ యుద్ధం అనేది తుపాకీ గుండ్ల కంటే వేగంగా ఒక దేశపు పరువును తీయగలదని ఈ హ్యాకింగ్ స్పష్టం చేసింది.