Begin typing your search above and press return to search.

ట్రంప్ వీర విధేయుడికి చిక్కులు..ఆఫీసు కంటే నైట్‌ క్లబ్బుల్లోనే ఎక్కువట

అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ కాష్ పటేల్‌పై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది.

By:  Tupaki Desk   |   3 May 2025 7:00 PM IST
FBI Director Kash Patel Faces Backlash Over Alleged Nightclub Visits
X

అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ కాష్ పటేల్‌పై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. ఆయన ఆఫీసులో కంటే నైట్‌క్లబ్బుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యూరోలో ప్రస్తుతం అంతా గందరగోళంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఎఫ్‌బీఐలో కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఫ్రాంక్ ఫిగ్లియుజ్జి ఈ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఫిగ్లియుజ్జి ఒక టీవీ షోలో మాట్లాడుతూ.. "హూవర్ బిల్డింగులోని ఏడో అంతస్తులో కంటే ఇప్పుడు ఆయన నైట్‌క్లబ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యమైన బ్రీఫింగ్‌లు కూడా రోజూ కాకుండా వారానికి రెండుసార్లకు మార్చేశారట. ఇది మంచిదా చెడ్డదా అని చెప్పలేం. ఎందుకంటే ఆయనకు సరైన అనుభవం లేకుండా పనులు చేయాలని చూస్తే, అవి చాలా ప్రమాదకరంగా మారవచ్చు. ఏజెంట్లు ఎలా పనిచేస్తున్నారో ఆయనకు పట్టనట్టుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి" అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, కాష్ పటేల్ వనరులను దుర్వినియోగం చేస్తున్నారని, ముఖ్యంగా ఏజెన్సీకి చెందిన ప్రైవేట్ జెట్‌లను వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటున్నారని డెమోక్రాట్లు ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో అంతర్జాతీయ మీడియా కూడా కాష్ పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి కోసం గట్టిగా ప్రయత్నించారని కథనాలు రాసింది. తన రాజకీయ శత్రువులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి పటేల్ సరైన వ్యక్తి అని అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించినట్లు తెలిపింది. 2020లో ట్రంప్ అతడిని సీఐఏ డైరెక్టర్‌గా నియమించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఆ సమయంలో ట్రంప్ తన చివరి వారాల్లో ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌గా కాష్‌ పటేల్ ను నియమించాలని అనుకున్నారు. భారతీయ మూలాలున్న కాష్ పటేల్ మొదటి నుంచి ట్రంప్‌కు వీర విధేయుడిగా పేరు తెచ్చకున్నారు. ఆయన ట్రంప్ 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అజెండాకు పూర్తిగా మద్దతు పలికాడు. ఇప్పుడు ఆయనపై ఇన్ని ఆరోపణలు రావడంతో ఎఫ్‌బీఐ ప్రతిష్ట మంటగలిసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.