Begin typing your search above and press return to search.

కొడుకు మీద ఫోకస్ చేసి ఓడిపోయిన తండ్రి

ఈసారి ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విశేషాలకు కొదవ లేదు. ఎన్నో సిత్రాలు చోటు చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   4 Dec 2023 6:42 AM GMT
కొడుకు మీద ఫోకస్ చేసి ఓడిపోయిన తండ్రి
X

ఈసారి ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విశేషాలకు కొదవ లేదు. ఎన్నో సిత్రాలు చోటు చేసుకున్నాయి. అత్యంత బలవంతులు.. శక్తివంతులు అన్నోళ్లను సింఫుల్ గా ఓడించేసిన ఓటర్లు.. పెద్దగా పేరు ప్రఖ్యాతుల్ని లేని వారిని సైతం ఆదరించి.. అందలం ఎక్కించేయటం ఆసక్తికరంగా మారింది. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. మైనంపల్లి హన్మంతరావు ఎపిసోడ్ ను చూసినప్పుడు మాత్రం ప్రత్యర్థులు సైతం అయ్యో అనే పరిస్థితి. అదే సమయంలో ఆయన తీరును కొందరు తీవ్రంగా తప్పు పడుటం కనిపిస్తుంది. ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే మాత్రం.. మరీ అంత అతి విశ్వాసమా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

మొత్తంగా చూస్తే పోరాడి గెలిచి.. తన కొడుకును గెలిపించుకొని.. హరీశ్ మీద అధిక్యతను ప్రదర్శించిన మైనంపల్లి చివరకు వచ్చేసరికి తాను మాత్రం ఓటమిపాలు కావటం ఈ మొత్తం ఎపిసోడ్ లో అతి పెద్ద ట్విస్టుగా చెప్పాలి. అప్పుడెప్పుడో వర్మ తీసిన సత్య సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నువ్వు మొదలు పెడితే.. అక్కడితో ఆగదు.. చివరకు అది నిన్ను కూడా నాశనం చేస్తుంది.. మనందరిని లేకుండా చేస్తుందంటూ చెప్పే సన్నివేశం ఉంటుంది.

మైనంపల్లి ఎపిసోడ్ చూస్తే.. అభ్యర్థుల ప్రకటన వేళ సీఎం కేసీఆర్ తన జాబితాలో సిట్టింగులో భాగంగా మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి స్థానానికి గులాబీ అభ్యర్థిగా పేరును ప్రకటించారు.అయితే..ఆయనకున్న అతి ముఖ్యమైన విన్నపం.. ఆయన కుమారుడ్ని మెదక్ గులాబీ అభ్యర్థిగా ప్రకటించాలని. కానీ.. స్థానిక సమీకరణాల కారణంగా కేసీఆర్ అందుకు నో చెప్పిన పరిస్థితి.

ఎందుకంటే.. మారిన సమీకరణాల్లో హరీశ్ పార్టీకి అత్యంత కీలకంగా మారటం.. ఆయన వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ కు టికెట్ ఇవ్వకుండా మైనంపల్లి కొడుక్కి ఇవ్వలేరు. ఈ నేపథ్యంలో హరీశ్ మీద ఘాటు విమర్శలు.. ఆరోపణలు చేసిన మైనంపల్లి.. కొడుకును తీసుకొని కాంగ్రెస్ కు వెళ్లిపోయారు. తన కొడుక్కి తాను కోరుకున్నట్లే మెదక్ టికెట్ ను ఇప్పించుకున్న ఆయన.. తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్నారు.

ఇక్కడే అసలు కథ మొదలైంది. హరీశ్ మీద యుద్ధం చేసిన వేళ.. తన కంటే కూడా తన కొడుకు గెలుపు మైనంపల్లికి ప్రతిష్టగా మారింది.దీంతో ఆయన ఫోకస్ అంతా కొడుకు పోటీ చేస్తున్న మెదక్ మీద వెళ్లింది. అదే సమయంలో.. తాను పోటీ చేస్తున్న మల్కాజిగరిలో తనకు తిరుగులేదని.. తన హవాకు బ్రేకులు వేసేంత సీన్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి లేదన్నట్లుగా ఫీలయ్యారు. ఆ అతి నమ్మకంఆయన కొంప ముంచేలా చేసింది. తాజాగా వెలువడిన ఫలితాల్ని చూస్తే.. తన కొడుకును గెలిపించుకోగలిగిన మైనంపల్లి.. తానుమాత్రం ఓడిపోయారు. ఆయన కానీ గెలిచి ఉంటే.. గ్రేటర్ లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలవటమే కాదు.. మంత్రి పదవిని అప్పజెప్పేవారు. ఇదంతా చూస్తే.. గెలిచి ఓడిన తండ్రిగా మైనంపల్లి నిలుస్తారు. రాజకీయమా మజాకానా?