Begin typing your search above and press return to search.

రైతులను చెదరగొట్టేందుకు... కర్ణభేరిని టార్గెట్ చేస్తున్నారు!

ఇదే సమయంలో డ్రోన్ల సహాయంతో పోలీసులు బాష్ప వాయుగోళాలను విడుదల చేస్తుండటంతో వాటికి చెక్‌ పెట్టేందుకు రైతులు సరికొత్త ఆలోచన చేశారు. ఇందులో భాగంగా డ్రోన్ లను అడ్డుకునేందుకు కొందరు రైతులు పతంగులను ఎగరేశారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:40 AM GMT
రైతులను చెదరగొట్టేందుకు... కర్ణభేరిని టార్గెట్  చేస్తున్నారు!
X

కుర్చీ ఎక్కేవరకూ రైతే రాజు లాంటి మాటలు... కుర్చీ ఎక్కిన తర్వాత రైతులపై లాఠీ చార్జీలు, భాష్పవాయు ప్రయోగాలు, రబ్బర్ బుల్లెట్ల వర్షాలు! ఇది దశాబ్ధాలుగా రైతులపై పాలకుల చూపిస్తున్న అవకాశవాద ప్రేమ!!"జై జవాన్ - జై కిసాన్" అని చెప్పుకునే ఈ దేశంలో... దేశంకోసం ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబ సభ్యులు కూడా వారిని ఆదుకోమని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఈ దేశానికి సొంతం! ఇదే సమయంలో... ఈ దేశానికి వెన్నుముఖగా ఉన్న రైతు గిట్టుబాటు ధర కల్పించాలని కోరితే నరకం చూపించడం కూడా అత్యంత సహజం!

అవును... పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ "ఢిల్లీ చలో" ఆందోళన చేపట్టిన రైతులను అడ్డుకోవడానికి, చెదరగొట్టడానికి ప్రభుత్వాలు పోలీసులకు సరికొత్త సూచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పంజాబ్‌, హరియాణా సరిహద్దు వద్దకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. వారంతా ఢిల్లీవైపు సాగేందుకు ప్రయత్నించగా పోలీసులు బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు.

రైతుల ముందస్తు జాగ్రత్తలు!:

తమపై పోలీసులు చేస్తున్న అటాక్ లనుంచి తప్పించుకునేందుకు రైతులు ముందాస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... బాష్ప వాయు గోళాల నుంచి వచ్చే పొగనుంచి రక్షణ కోసం నీళ్ల ట్యాంకులను తెచ్చి పెట్టుకున్నారు. ఇదే సమయంలో శరీర రక్షణ పరికరాలను, కళ్ల రక్షణ అద్దాలనూ ధరించారు.

ఇదే సమయంలో డ్రోన్ల సహాయంతో పోలీసులు బాష్ప వాయుగోళాలను విడుదల చేస్తుండటంతో వాటికి చెక్‌ పెట్టేందుకు రైతులు సరికొత్త ఆలోచన చేశారు. ఇందులో భాగంగా డ్రోన్ లను అడ్డుకునేందుకు కొందరు రైతులు పతంగులను ఎగరేశారు.

రైతుల వినికిడి శక్తిని దెబ్బతీసేలా...!

"ఢిల్లీ చలో" పేరుతో రైతులు చేపట్టిన ఆందోళనలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న పోలీసులు సరికొత్త ఆలోచనలను చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రోడ్లపై కాంక్రీట్‌ నిర్మాణాలు, ముళ్ల కంచెలు, మేకులు తదితరాలను వినియోగిస్తున్నారు. వాటిని దాటుకుని వస్తున్న రైతులను అడ్డుకునేందుకు బాష్ప వాయుగోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను వాడుతున్నారు. లాఠీ చార్జి చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు తగ్గడం లేదు.

దీంతో ఈసారి మరో ఆయుధాన్ని వాడేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా... ఎల్‌.ఆర్‌.ఏ.డీ. (లాంగ్ రేంజ్ అకాస్టిక్ డివైజ్) అనే శబ్ధ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. దీని ద్వారా ఆందోళనకారుల చెవులకు చిల్లులు పడేంతగా భారీ శబ్దాలను సృష్టించవచ్చు. ఫలితంగా... కర్ణభేరికి చిల్లులుపడి వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆందోళన కేంద్రాల వద్ద ఢిల్లీ పోలీసులు ఈ ఎల్‌.ఆర్‌.ఏ.డీలను మోహరించారు.