Begin typing your search above and press return to search.

ఇది ఎల్ నినో ప్రభావమా? నీటి చుక్క కోసం పోరాటం.. ట్యాంకర్లతో వరి పంటకు ప్రాణం పోస్తున్న అన్నదాత!

ప్రపంచం దీనిని 'ఎల్ నినో' అనవచ్చు. వ్యవసాయ నిపుణులు దీనిని 'భూగర్భ జలాల మితిమీరిన వినియోగం' అని విశ్లేషించవచ్చు.

By:  A.N.Kumar   |   16 July 2026 10:00 PM IST
ఇది ఎల్ నినో ప్రభావమా? నీటి చుక్క కోసం పోరాటం.. ట్యాంకర్లతో వరి పంటకు ప్రాణం పోస్తున్న అన్నదాత!
X

నేల తల్లి రొమ్ము చీల్చి.. చెమటను నీరుగా మార్చి లోకానికి బువ్వ పెట్టే అన్నదాత ఈరోజు కన్నీటి సముద్రంలో మునిగిపోతున్నాడు. ఎండలు మండుతున్నాయి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. కానీ వాటన్నింటికంటే మిన్నగా రైతు గుండె మండుతోంది. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే ఆ పసిప్రేమను తట్టుకోలేక నీటి చుక్క కోసం చేస్తున్న పోరాటం ఇవాళ యావత్ దేశాన్ని కదిలిస్తోంది. కర్ణాటక నుంచి కరీంనగర్ దాకా వినిపిస్తున్నది ఒకటే ఆర్తనాదం... "నా ప్రాణం పోయినా పర్లేదు.. నా పంట ఎండిపోకూడదు." అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎండిపోతున్న బోర్లు.. అప్పుల ఊబిలో రైతు గుండె

రోజుకు పది వేల రూపాయలు.. అవును అక్షరాలా పది వేల రూపాయలు అప్పు చేసి మరీ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి పంటను కాపాడుకుంటున్నాడు ఓ కన్నడ రైతు. ట్రాక్టర్లపై ట్యాంకర్లను కట్టుకుని పొలాలకు నీటిని తరలిస్తున్న రైతుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. పెట్టుబడి పోతుందనే భయం కాదు.. అది కేవలం వేల రూపాయల పెట్టుబడి గురించిన ఆందోళన మాత్రమే కాదు.. నెలల తరబడి రక్తాన్ని కూడు చేసి పెంచిన పంట తల్లి కళ్లముందే నశించిపోతుంటే చూడలేక పడుతున్న ఆరాటం.

వ్యవసాయం అంటే జూదం..వర్షాలు పడవు.. భూమిలో నీరుండదు. అయినా సరే అప్పులు తెచ్చి మరీ నీటిని కొని బావుల్లో పోస్తూ ఆశ చావక పండించేందుకు ప్రయత్నిస్తున్నాడంటే... అది కేవలం వ్యాపారం కాదు.. ఒక పవిత్రమైన యజ్ఞం.

ఎల్ నినో శాపమా? వాతావరణ మార్పుల కోపమా?

ప్రపంచం దీనిని 'ఎల్ నినో' అనవచ్చు. వ్యవసాయ నిపుణులు దీనిని 'భూగర్భ జలాల మితిమీరిన వినియోగం' అని విశ్లేషించవచ్చు. కానీ ప్రకృతి విసిరే ప్రతి కోపానికి, పాలకుల ఉదాసీనతకు బలైపోతున్నది మాత్రం అట్టడుగున ఉన్న రైతు మాత్రమే. కాంక్రీట్ వనాలు పెరిగి, పచ్చదనం కరువై, గ్లోబల్ వార్మింగ్ కోరలు చాస్తున్న వేళ.. ఈ సంక్షోభం కేవలం ఒక సీజన్ కరువు కాదు. ఇది భవిష్యత్తులో రాబోయే మహా విపత్తుకు హెచ్చరిక

ఇకనైనా మేల్కొందాం.. అన్నదాతను ఆదుకుందాం

ఈ రోజు రైతు రోడ్డుపై నిలబడి నీటి ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నాడంటే అది కేవలం అతని ఓటమి కాదు. సమాజంగా మనందరి ఓటమి. ప్రభుత్వం కేవలం గణాంకాలతో కాలం గడపకుండా తక్షణ చర్యలు చేపట్టాలి. అత్యవసర కార్యాచరణ అవసరం. ఎండిపోతున్న పంటలను కాపాడటానికి ప్రభుత్వమే ఉచితంగా లేదా రాయితీపై నీటి ట్యాంకర్లను సరఫరా చేయాలి. భూగర్భ జలాల సంరక్షణ కోసం యుద్ధప్రాతిపదికన రీఛార్జ్ పద్ధతులను అమలు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా బిందు సేద్యం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు భరోసా ఇవ్వాలి.

చేనులో పండిన వరి బువ్వే మన ఆకలి తీరుస్తుంది. ఆ వరి చేనును కాపాడుకోవడానికి రైతు పడుతున్న ఆరాటాన్ని, కన్నీటిని తుడువాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అన్నదాత శ్రమకు తగిన ఫలితం దక్కాలి, అతని గుండెల్లో ఆశల పంట పండాలి. పాలకులు, సమాజం తక్షణమే స్పందించి రైతు పోరాటానికి అండగా నిలవాలని ఆశిద్దాం.