మేడమ్ ఫ్యాన్ ని..ఐఏఎస్ ఇంటికి స్వీట్ బాక్స్ తో వెళ్లాడు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఒక ఐఏఎస్ అధికారిణికి.. తానో అభిమానినంటూ తరచూ ఇబ్బందిపెడుతున్న వైనం తాజాగా వెలుగు చూసింది.
By: Tupaki Desk | 16 Sept 2023 9:45 AM ISTసోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఒక ఐఏఎస్ అధికారిణికి.. తానో అభిమానినంటూ తరచూ ఇబ్బందిపెడుతున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఆ మధ్యన ఒక మహిళా ఐఏఎస్ కు ఎదురైన వేధింపులు మర్చిపోకముందే.. తాజా ఉదంతం విస్తుపోయేలా చేసింది. సికింద్రాబాద్ పరిధిలోని మార్కెట్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించిన కేసు నమోదైంది. అసలేం జరిగిందంటే..
తెలంగాణ ప్రభుత్వ విభాగానికి సంచాలకురాలిగా వ్యవహరిస్తున్నారు ఒక మహిళా ఐఏఎస్ అధికారి. శివప్రసాద్ అనే వ్యక్తి.. సదరు మేడమ్ ను కలవాలంటూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆగస్టు 22న ఆఫీసుకు వెళ్లాడు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్నట్లు చెప్పిన అతను.. తాను మేడమ్ కు పెద్ద ఫ్యాన్ నని.. ఆమెను కలవాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. అక్కడితో ఆగని అతను లంచ్ టైంలో అతను ఆమె ఆఫీసుకు వెళ్లి.. కలిసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు మహిళా ఐఏఎస్ అధికారిణి.. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలకు పంపొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఈసారి సదరు అధికారిణి ఇంటికి శివప్రసాద్ నేరుగా వెళ్లిన వైనం విస్తుపోయేలా చేసింది. స్వీట్ బాక్సు తీసుకొని నేరుగా ఇంటికి వెళ్లి.. కాలింగ్ బెల్ నొక్కగా.. ఇంట్లోని సహాయకుడు తలుపు తీశారు.
తాను మేడమ్ ను కలిసేందుకు వచ్చినట్లుగా చెప్పటంతో షాక్ తిన్న సదరు అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అతన్ని వెనక్కి పంపేశారు. తనను తరచూ కలిసేందుకుప్రయత్నిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్న శివప్రసాద్ పై కంప్లైంట్ ఇవ్వగా.. ఐపీసీ సెక్షన్ 354డి కింద కేసు నమోదు చేశారు.
