శవమంటే భయం... మానవ బంధాలు హీనం
బతికుంటే శివం...మరణిస్తే శవం. ఊపిరి ఆడితే మనిషి అది ఆగితే కట్టె మాత్రమే. వేదాంతం ఏమి చెప్పినా ఇదే జీవిత సత్యం.
By: Satya P | 13 Feb 2026 9:23 AM ISTబతికుంటే శివం...మరణిస్తే శవం. ఊపిరి ఆడితే మనిషి అది ఆగితే కట్టె మాత్రమే. వేదాంతం ఏమి చెప్పినా ఇదే జీవిత సత్యం. ఇదే నిఖార్సు అయిన నిజం. ఇలా ఎంత చెప్పుకున్నా కూడా మనిషిని మరణించాక అంత్య క్రియలు నిర్వహించాలి. ఏళ్ళకు ఏళ్ళు నివసించిన ఆ దేహాన్ని గౌరవంగా సాగనంపాలి. ఎవరి నమ్మకాలు ఎవరి సంప్రదాయాల ప్రకారం ఈ ఆఖరి కర్మలను నిర్వహించడం ఒక పద్ధతి. అయితే వృద్ధులను బతికుండగానే చూడని తరం నడుస్తోంది. రోగం రొష్టు వచ్చి ఆసుపత్రిలో ఉంచితే పట్టించుకునే నాధుడు కనబడడం లేదు, ఇక శవమై వస్తే బాబోయ్ చూడలేం, మాకు భయం అంటున్న జనమూ కనిపిస్తున్నారు. వీటిని చూసి ఇదేమి మానవత్వం అని నోళ్ళు నొక్కుకోవచ్చు కానీ ఇదే అంతటా జరుగుతోంది మరి.
బాధాకరమైన ఘటన :
తాజాగా మహారాష్ట్రలో ఒక బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. తన కుటుంబానికి చెందిన వారు, రక్తం పంచుకున్న వారు ఒక మనిషి చనిపోయారు. అంబులెన్స్ లో ఆ శవం ఉంది. అయితే ఆ శవంతో కలసి అదే అంబులెన్స్ లో ప్రయాణం చేయడానికి తోటి కుటుంబీకులే నిరాకరించిన హృదయ విదారకమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరణించినా తమ ఫ్యామిలీ మెంబర్ అని భావించి ఆ మృత దేహంతో కలసి రావడానికి సొంత వారే అంగీకరించకపోవడం క్షీణిస్తున్న మానవ సంబంధాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.
వీడియో బైట్ వదిలిన డ్రైవర్ :
ఈ నేపథ్యంలో ఆ అంబులెన్స్ డ్రైవర్ ఒక వీడియో బైట్ ని సోషల్ మీడియాకు వదిలి జరిగిన దారుణాన్ని ప్రపంచానికి తెలియచేశాడు. శవంతో కలసి అంబులెన్స్ లో ప్రయాణం చేయడానికి మాకు భయం అని కుటుంబ సభ్యులు వదిలి వెళ్ళిపోయారని వారు వేరే కారులో ప్రయాణించారని అంబులెన్స్ డ్రైవర్ చెబుతున్న మాటలు అయితే నెటిజన్లతో పాటు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. బతికున్నపుడు మనిషి మరణించాక శవం అవుతాడు. మరి శవం అయ్యాడని చూస్తున్నారు కానీ తమ కుటుంబ సభ్యుడే కదా నిన్నటిదాకా తమతో కలసి మెలసి ఉన్నాడు కదా అని ఎందుకు ఆలోచించలేక పోతున్నారు అని నెట్టింట అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అంతిమ సంస్కారం ఇదేనా :
బతికున్నపుడు సంగతి ఎలా ఉన్నా మరణించాక అంతిమ సంస్కారం అని చేస్తారు. మరి మనిషిలో సంస్కారం నశిస్తున్న వేళ ఇక ఏమి చేస్తారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పేరుకు ఇది ఒక చోట జరిగిన ఘటనగా అనిపిస్తున్నా ఇది రేపటి రోజులను గుర్తు చేస్తోంది. ఈ రోజు జీవించి ఉన్న వారి భవిష్యత్తుని భయంగా మారుతోంది. ఒక కాకి పోతే పది కాకులు ఈ రోజుకీ చేరి కావుమంటున్నాయి, సంఘీభావం తెలియచేస్తున్నాయి. పశువులల్లో ఆ ఐక్యత ఉంది, తోటి పశువు విగతజీవి అయిందన్న కన్నీరు ఉంది. మనిషికి ఏమైంది అని ఇలా చేస్తున్నారు అంటే బహుశా జవాబు లేదేమో. కలికాలం అంటారు, అది కేవలం మనిషికే వచ్చిందా అంటే మెదడుకు పట్టిన బూజునే అలా పేరు పెట్టి చెప్పాలేమో.
