అమరావతి ముంపుపై మీడియాలో ప్రసారాలు.. ఉలిక్కిపడిన ప్రభుత్వం ఏం చేసిందంటే..?
వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఈ విషయంపై మీడియాతోనూ మాట్లాడారు. అయితే గుంటూరు చానల్ కు అసలు నీరే వదల్లేదని ఇంజనీరింగ్ అధికారులు ఖండించారు.
By: Tupaki Desk | 18 Aug 2025 6:43 PM ISTవిజయవాడ నగరానికి ముంపు ప్రమాదం ఉందని, కొండవీటి వాగు ఉధృతి వల్ల గుంటూరు జిల్లా పొన్నూరు మునిగిపోనుందని ప్రచారం చేసిన మీడియా చానళ్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ప్రజలను భయబ్రాంతులను చేసేలా కథనాలు ప్రచారం చేయడాన్ని సీరియస్ గా పరిగణించిన ప్రభుత్వం వైసీపీ అనుకూల మీడియా చానళ్లపై రెండు కేసులు నమోదు చేసింది. ఇంజనీరింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ రెండు చానళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వం వ్యూహంపై సస్పెన్స్ ఏర్పడింది.
ప్రకాశం బ్యారెజ్ గేట్లు మరమ్మతులకు గురికావడంతో ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడం లేదని, దీనివల్ల విజయవాడ ముంపునకు లోనయ్యే అవకాశం ఉందని ఓ యూట్యూబ్ చానల్ కథనం ప్రసారం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విజయవాడ వాసులు భయాందోళనలకు గురయ్యారు. గత ఏడాది అనుభవనాలను గుర్తుకు తెచ్చుకుని హడలిపోయారు. అదేవిధంగా అమరావతి ముంపునకు గురికాకుండా కొండవీటి వాగును ఎత్తిపోసి వరదను గుంటూరు చానల్ లోకి మళ్లిస్తున్నారని, దీనివల్ల గుంటూరు జిల్లాలోని పొన్నూరు మునిగిపోయే అవకాశం ఉందని వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మరో కథనం ప్రసారమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఈ విషయంపై మీడియాతోనూ మాట్లాడారు. అయితే గుంటూరు చానల్ కు అసలు నీరే వదల్లేదని ఇంజనీరింగ్ అధికారులు ఖండించారు. వర్షాల వల్లే స్థానిక డ్రెయిన్లు, కాలువలు ద్వారా ప్రవాహాలు వచ్చి చేరినట్లు తెలిపారు. అంతేకాకుండా పొన్నూరు మునుగోతోందంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ, ప్రజలను భయాందోళనకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొండవీటి వాగు ప్రాజెక్టు ఏఈఈ సీహెచ్ అవినాశ్ ఆదివారం తాడేపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మీడియా చానల్, ఇతరులపై విపత్తు నిర్వహణ చట్టం-2025 కింద బీఎన్ఎస్ 353(1), సెక్షన్ 45 కింద కేసులు నమోదు చేశారని చెబుతున్నారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ గేటు పనిచేయడం లేదని అసత్య కథనం ప్రసారం చేసిన సుమన్ టీవీపైనా అధికారులకు ఫిర్యాదు చేశారు.
67వ నంబరు ఖానా వద్ద గేటు పనిచేస్తోందని స్పష్టం చేశారు. ‘విరిగిపోయిన 67వ గేటు.. భారీ వరదకు విజయవాడ మునిగేలా ఉంది’ అంటూ ప్రసారం చేసిన యూట్యూబ్ చానల్ పై ఏఈఈ సత్య రాజేశ్ శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ 353(1), 54 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. తప్పుడు కథనాలపై వన్ టౌన్ కేసు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వ చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలపై వ్యక్తులు, వైసీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టుచేసి జైలుకు పంపారు. కానీ, ఇప్పుడు తొలిసారిగా రెండు మీడియా సంస్థలపై కేసులు నమోదు చేయడం పెను సంచలనంగా మారింది.
సహజంగా వార్తా కథనాలను ప్రసారం చేసిన సమయంలో అందులో వాస్తవం లేకపోతే ప్రభుత్వం ఖండిస్తుంది. తమ వివరణను ప్రచారం చేయాల్సిందిగా సంబంధిత మీడియాను కోరుతుంది. కానీ, తప్పుడు కథనాలు ప్రసారం చేశారన్న ఆరోపణలతో ఏకంగా కేసులు నమోదు చేయడమే చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం సాక్షి టీవీ డిబేట్ లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనితోపాటు కేఎస్ఆర్ లైవ్ షోలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణంరాజును అరెస్టు చేయించింది. అయితే ఇప్పుడు ఆ కేసుకు దీనికి సంబంధం లేకపోయినా, తప్పు చేస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామన్న ప్రభుత్వ వైఖరి తాజా పరిణామాలతో మరోసారి పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కేసులు నమోదుచేసిన వ్యవహారంలో నిందితులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
