Begin typing your search above and press return to search.

సంచలనం : తెలంగాణలో రూ.4,215 కోట్ల స్కాం

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   7 July 2025 11:38 AM IST
సంచలనం : తెలంగాణలో రూ.4,215 కోట్ల  స్కాం
X

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఫాల్కన్‌ గ్రూప్‌ పేరుతో జరిగిన అక్రమ డిపాజిట్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మొత్తం రూ.4,215 కోట్ల మేర మోసం జరిగిన ఈ కేసులో తెలంగాణ సీఐడీ ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా, తాజాగా ఫాల్కన్ గ్రూప్‌కు చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (సీవోవో) ఆర్యన్ సింగ్‌ను పంజాబ్‌లో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించింది.

ఫాల్కన్ గ్రూప్‌ మోసాల మాయాజాలం

ఫాల్కన్‌ గ్రూప్‌, దాని అనుబంధ సంస్థలు అయిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా అక్రమంగా డిపాజిట్లు సేకరించాయి. గూగుల్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తూ స్వల్పకాలికంగా అధిక వడ్డీ రేట్లను హామీ ఇచ్చే స్కీములతో పెట్టుబడిదారులను ఆకర్షించాయి.

ప్రముఖ బహుళజాతి సంస్థల పేర్లతో నకిలీ ఒప్పందాలు రూపొందించి, వాటి ఆధారంగా ప్రజలను నమ్మించి రూ.4,215 కోట్లు సేకరించాయి. ఈ మోసంలో 7,056 మంది డిపాజిటర్లు ఉన్నారని సీఐడీ వెల్లడించింది. వారిలో 4,065 మందికి రూ.792 కోట్ల మేర తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

- ఆర్యన్‌ సింగ్‌ పాత్ర కీలకం

ఈ భారీ మోసంలో ఐదో నిందితుడిగా గుర్తించబడిన ఆర్యన్ సింగ్‌ పాత్ర కీలకంగా ఉంది. తన మేనేజింగ్ డైరెక్టర్‌ అమర్‌దీప్ కుమార్‌తో కలిసి ఆర్యన్ సింగ్ మోసపూరిత కార్యకలాపాలను పర్యవేక్షించాడు. డిపాజిటర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకొని, వారి నమ్మకాన్ని చూరగొని రసీదులు ఇచ్చిన ఆర్యన్‌, మొత్తం రూ.14.35 కోట్ల వ్యూహాత్మక డిపాజిట్లు సేకరించాడు. అందులో రూ.1.62 కోట్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

- అరెస్ట్‌, రిమాండ్‌

నేరం బయటపడిన వెంటనే ఆర్యన్‌ సింగ్‌ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ముంబయి నుంచి నాందేడ్‌కు, అక్కడి నుంచి పంజాబ్‌లోని బతిండా జిల్లాలోని ఒక గురుద్వారాకు వెళ్లి దాక్కున్నాడు. సీఐడీ బృందం అతని లోకేషన్‌ను సాంకేతికంగా ట్రేస్ చేసి జూలై 4న చాకచక్యంగా అరెస్ట్‌ చేసింది. ఆర్యన్‌ వద్ద రెండు సెల్‌ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.

ఇంకా నిందితుల కోసం గాలింపు

ఇప్పటివరకు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐడీ తెలిపింది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. అంతేకాకుండా, ఫాల్కన్‌ గ్రూప్‌ మరియు దాని డైరెక్టర్లపై దేశవ్యాప్తంగా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం మరింత లోతుగా వెలుగు చూసే అవకాశం ఉంది.

తెలంగాణలో ప్రభుత్వ మార్పుతో ఆర్థిక నేరాలకు సంబంధించిన చీకటి వలయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫాల్కన్‌ గ్రూప్‌ మోసం కేసు ఆర్థిక నేరాల పట్ల కొత్త ప్రభుత్వ కఠిన వైఖరిని చాటుతోంది. బాధితులకు న్యాయం జరిగే దిశగా సీఐడీ చర్యలు మరింత వేగవంతం కావాలి. ప్రజలు కూడా ఇలాంటి ఆకర్షణీయమైన పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.