లండన్ లో జగన్ పై తప్పుడు ప్రకటనలు... ఇది ఎవరి పైత్యం?
పదిరోజుల పర్యటన నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Sept 2023 2:39 PM ISTపదిరోజుల పర్యటన నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 న తన భార్య వైఎస్ భారతి తో కలిసి లండన్ బయలుదేరిన ఆయన... తిరిగి ఈ నెల 12న ఏపీకి రానున్నారు. ఈ సమయంలో ఫ్యామిలీతో ప్రశాంతంగా గడుపుతున్న జగన్ పై కొంతమంది తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు.
అవును... ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్, పూర్తిగా తన ఫ్యామిలీతో గడుపుతున్న సంగతి తెలిసిందే. లండన్ టూర్ మొత్తం తన భార్య, కుమార్తెలతోనే గడపాలని ఫిక్సయిన జగన్... వైసీపీ నేతలకు కూడా ఎక్కడున్నారనే విషయం చెప్పకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.
సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ఎన్నారై విభాగాలు యాక్టివ్ అవుతాయి. రోజు కో మీటింగ్ పెట్టడం, వీలైతే స్థానిక టీవీల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. అక్కడున్న ఇండియన్స్ ని వ్యక్తిగతంగా కలుస్తుంటారు. అయితే జగన్ మాత్రం దీన్ని పూర్తిగా పర్సనల్ ట్రిప్ గా ప్లాన్ చేసుకున్నారు.
అయితే ఈ సమయంలో జగన్ పై ట్రోలింగ్ కి దిగింది ఒక బ్యాచ్! ఇందులో భాగంగా సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏపీ సీఎం జగన్ అందరికీ అందుబాటులో ఉంటారని, వచ్చి కలవొచ్చని సోషల్ మీడియాలో ఒక ప్రకటన వైరల్ అవుతుంది. "మీట్ అండ్ గ్రీట్ విత్ అవర్ లీడర్ సీఎం జగన్ మోహన్ రెడ్డి" అంటూ ఉన్న ఈ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రకటన వైసీపీ నేతలు పెట్టింది కాదు. ఇది ఎవరో పైత్యం పరాకాష్టకు చేరుకున్న వ్యక్తులు పెట్టిందని తెలుస్తుంది. కారణం... ఈ మీట్ & గ్రీట్ కి వారు ఎంపిక చేసిన వేదిక మెంటల్ ఆసుపత్రి కావడమే! లండన్ ఎంహెచ్‌సీ సెంటర్ లో జగన్ ని కలవొచ్చని, లంచ్ కూడా ఉంటుందని అడ్రస్ లేని వ్యక్తులు ఈ ప్రకటన చేశారు.
లండన్ ఎం.హెచ్.సి. అంటే... లండన్ మెంటల్ హెల్త్ సెంటర్! జగన్ కు మానసిక సమస్యలు ఉన్నాయని, ఆయన లండన్ లో చికిత్స పొందుతున్నారని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఇలాంటి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో... ఇది ఫేక్ ప్రకటన అని వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ వివరణ ఇచ్చారు.
మీట్ అండ్ గ్రీట్ విత్ జగన్ ఇన్ లండన్ అంటూ సర్కులేట్ అవుతున్న సోషల్ మీడియా మెసేజ్ ఫేక్ అని, జగన్ లండన్ పర్యటన పూర్తి వ్యక్తిగతమని, ఈ టూర్ గురించి అందరికీ ఎంత తెలుసో తనకూ అంతే తెలుసని వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ ప్రదీప్ చింతా వెల్లడించారు.
ఇదే సమయంలో... యూకేలో జగన్ కేవలం ఫ్యామిలీతోనే సమయం గడుపుతారని, ఎవరితోనూ ఎలాంటి మీటింగ్ ను నిర్వహించడం లేదని.. ఎవరో ఆకతాయిలు కావాలనే ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారని.. దాన్ని పట్టించుకోవద్దని ప్రదీప్ చింతా సూచించారు.
