Begin typing your search above and press return to search.

ఇది మామూలు 'ఫేక్' కాదు... లేని దేశానికి భారత్ లో ఇతడు అంబాసిడర్!

వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీ ఎన్‌.సీ.ఆర్‌.కు సమీపంలోని గాజియాబాద్‌ లో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి విలాసవంతమైన రెండు అంతస్తుల ఇంటిని అద్దెకు తీసుకొన్నాడు.

By:  Tupaki Desk   |   24 July 2025 2:00 AM IST
ఇది మామూలు ఫేక్ కాదు...  లేని దేశానికి భారత్  లో ఇతడు అంబాసిడర్!
X

దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌.సీ.ఆర్‌.కు సమీపంలోని గాజియాబాద్‌ లో రెండంతస్తుల విశాల భవనం.. దానిపై మరో దేశానికి చెందిన జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. ఇక ఆ భవనం బయట ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిపై ఎంబసీ స్టిక్కర్లు అతికించబడి ఉన్నాయి. దానిలో వెస్ట్‌ ఆర్కిటికా పేరుతో దౌత్యకార్యాలయం నడుస్తుంది! దీన్నీ తాజాగా యూపీ ఎస్.టీ.ఎఫ్. అధికారులు ఛేదించారు.

అవును... లేని దేశానికి ఎంబసీ కార్యాలయం ఓపెన్ చేసి.. అక్కడ దౌత్య పాస్‌ పోర్టులు, విదేశీ కరెన్సీ, దేశంలోని ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలతో ఓ వ్యక్తి హల్ చల్ చేస్తున్నాడు. ఈ ఎంబసీ పేరు చెప్పి జాబ్ రాకెట్ నడుపుతున్నాడు. చివరకు ఉత్తరప్రదేశ్‌ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్.టీ.ఎఫ్.) అధికారుల చేతికి చిక్కాడు. అతడు ఎవరు.. ఈ వ్యవహారం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దామ్...!

వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీ ఎన్‌.సీ.ఆర్‌.కు సమీపంలోని గాజియాబాద్‌ లో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి విలాసవంతమైన రెండు అంతస్తుల ఇంటిని అద్దెకు తీసుకొన్నాడు. అందులో వెస్ట్‌ ఆర్కిటికా పేరుతో దౌత్యకార్యాలయాన్ని నడుపుతున్నాడు. వాస్తవానికి ఆ దేశానికి ఎలాంటి గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో.. దీని పేరుతో విదేశాల్లో పని ఇప్పిస్తానని యువతను నమ్మిస్తూ ఓ జాబ్‌ రాకెట్ నడుపుతున్నాడు.

ఇదే సమయంలో... పనిలో పనిగా అన్నట్లుగా మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అంటున్నారు. ఈ సమయంలో యువతను నమ్మించేందుకు.. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలను వాడుకున్నాడు. తాజాగా ఎంబసీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో... పోలీసులకు అనుమానం వచ్చింది.

ఈ నేపథ్యంలో అతడి కార్యకలాపాలపై దృష్టిపెట్టారు. చివరకు ది నకిలీ ఎంబసీ కార్యాలయం అని గుర్తించి.. అతడి గుట్టు రట్టు చేశారు. ఈ సమయంలో అతడి వద్ద నుంచి వెస్ట్‌ ఆర్కిటికాతో పాటు 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్‌ పోర్టులు, విదేశాంగ శాఖ స్టాంపులున్న డాక్యుమెంట్లు, 34 దేశాల స్టాంపులు, రూ.44 లక్షల నగదు, ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా... యూఎస్ నేవీ అధికారి ట్రావిస్ మెక్‌ హెన్రీ 2001లో ఈ వెస్టార్కిటికాను ప్రకటించాడు. దీనికి తనను తాను గ్రాండ్ డ్యూక్‌ గా ప్రకటించుకున్నారు. అంటార్కిటాలో 6,20,000 చదరపు మైళ్ల మేర తనదే అని చెప్పుకున్నాడు. ఆ దేశానికి 2,536 మంది పౌరులు ఉన్నారని చెప్తున్నా.. వాస్తవానికి అక్కడ ఎవరూ నివసించడం లేదని అంటున్నారు.

ఇక జైన్ విషయానికొస్తే... ఇక ఈ వెస్టార్కిటికా ఎంబసీ పేరిట ఏర్పాటు చేసిన ఇన్‌ స్టాగ్రాంలో తనను తాను ఆ దేశానికి చెందిన సంపన్నుడిగా పేర్కొన్నాడు. ఈ క్రమమంలో న్యూఢిల్లీలోని వెస్టార్కిటికా కాన్సులేట్ జనరల్ 2017 నుండి పనిచేస్తోందని చెబుతున్నారు!