Begin typing your search above and press return to search.

కిలేడీ ఎస్ఐ.. కొంపదీసి ‘వెంకీ’ మూవీ చూసి స్ఫూర్తి పొందిందా?

నాగౌర్ జిల్లాకు చెందిన ఒక ట్రక్కు డ్రైవర్ కుమార్తె అయినా మోనా.. 2021లో రాజస్థాన్ సబ్ ఇన్ స్పెక్టర్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యింది.

By:  Tupaki Desk   |   6 July 2025 11:29 AM IST
కిలేడీ ఎస్ఐ.. కొంపదీసి ‘వెంకీ’ మూవీ చూసి స్ఫూర్తి పొందిందా?
X

అప్పుడెప్పుడో వచ్చిన వెంకీ మూవీ గుర్తుందా? హీరో.. అతడి స్నేహితులు తప్పుడు పత్రాలతో పోలీస్ శిక్షణలో పాల్గొనటం.. అందరిని మాయ చేయటం తెలిసిందే. ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందిందో ఏమో కానీ.. రాజస్థాన్ కు చెందిన ఒక కిలేడీ.. నకిలీ ధ్రువపత్రాలతో ఏకంగా రెండేళ్లలు ఎస్ఐగా విధులు నిర్వర్తించింది. తాజాగా బుక్ అయ్యింది సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

రాజస్థాన్ లోని సీకర్ జిల్లాకు చెందిన మోనా అలియాస్ మూలీదేవిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి కారణం ఏమిటో తెలుసా? అమ్మగారు ఏకంగా ఎస్ఐ అవతారం ఎత్తటమే కాదు.. రెండేళ్లు అధికారికంగా ఎస్ఐ మాదిరి ఫోజు కొడుతూ పోలీసు అకాడమీలో డ్యూటీ కూడా చేసేసింది.

నాగౌర్ జిల్లాకు చెందిన ఒక ట్రక్కు డ్రైవర్ కుమార్తె అయినా మోనా.. 2021లో రాజస్థాన్ సబ్ ఇన్ స్పెక్టర్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యింది. అనంతరం తప్పుడు పత్రాల్ని క్రియేట్ చేసిన ఆమె.. ఎస్ఐ ఎగ్జామ్ లో తాను పాస్ అయినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ వైరల్ అయ్యింది. అనంతరం ఎగ్జామ్ పాస్ అయిన ఎస్ఐల వాట్సప్ గ్రూపులో చేరిన ఆమె.. రాజస్థాన్ పోలీసు అకాడమీలో స్పోర్ట్స్ కోటా కింద చేరిన అభ్యర్థిగా పరిచయం చేసుకుంది.

రెండేళ్లు తప్పుడు మాటలు.. ఆధారాలతో నెట్టుకొచ్చిన ఆమె అసలు భాగోతం బయటకు వచ్చింది. కొంతమంది ట్రైనీ ఎస్ఐలకు మోనా మీద అనుమానం వచ్చింది. దీంతో ఆమెపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు గుట్టు చప్పుడు కాకుండా అంతర్గత విచారణ చేపట్టారు. చివరకు ఆమె నకిలీ పోలీసుగా గుర్తించారు. దీంతో వేట మొదలు పెట్టిన పోలీసులు చివరకు ఆమెను పట్టుకున్నారు. ఈమె లీలల గురించి తెలిసిన వారంతా విస్మయానికి గురయ్యే పరిస్థితి.