Begin typing your search above and press return to search.

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్: లక్షల వసూళ్లు

బీహార్‌లోని పూర్ణియా జిల్లా మోహని గ్రామంలో నకిలీ పోలీస్ స్టేషన్ వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 4:00 PM IST
బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్:  లక్షల వసూళ్లు
X

బీహార్‌లోని పూర్ణియా జిల్లా మోహని గ్రామంలో నకిలీ పోలీస్ స్టేషన్ వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి "గ్రామీణ రక్షాదళ్" పేరుతో ఒక నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, అమాయకులైన యువత నుంచి ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశాడు.

ఈ మోసగాడు కానిస్టేబుల్, చౌకీదార్ పోస్టుల్లో ఉద్యోగాలు ఇస్తానంటూ యువతను నమ్మబలికి, ఒక్కొక్కరి నుంచి రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు వసూలు చేశాడు.

నకిలీ యూనిఫాంలు, ID కార్డులతో అసలైన పోలీసుల మాదిరి దాడులు

రాహుల్ కుమార్ షా కేవలం డబ్బులు వసూలు చేయడమే కాకుండా, నకిలీ పోలీస్ యూనిఫాంలు, గుర్తింపు కార్డులు తయారు చేయించి యువతను చట్టవిరుద్ధంగా గ్రామాల్లో పెట్రోలింగ్ చేయించాడు. మరీ ముఖ్యంగా, మద్యం అక్రమ రవాణాపై దాడులు చేయించి, అందులో వచ్చిన లాభంలో కొంత భాగాన్ని తన వద్ద ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని ఈ నకిలీ పోలీసులకు పంచేవాడు. ఇలా దాదాపు ఒక సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా ఈ దందా కొనసాగింది.

నిందితుడు పరార్.. పోలీసుల గాలింపు కొనసాగుతోంది

ఈ వ్యవహారం బయటపడిన వెంటనే ప్రధాన నిందితుడు రాహుల్ కుమార్ షా పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏడాది కాలం పాటు నకిలీ పోలీస్ స్టేషన్ ఎలా సాగిందన్న దానిపై ఉన్నత స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.