Begin typing your search above and press return to search.

ప్రధాని మోదీ పథకం.. 'ముద్ర' పేరుతో భారీ దోపిడీ

ఏపీ సీఎం చంద్రబాబు ఫొటో, ఆయన మాటలను వక్రీకరించి ఆన్ లైన్ వేదికగా ఓ మోసగాడు భారీ దోపిడీ చేయాలని ప్రయత్నిస్తే ఏపీ పోలీసులు అడ్డుకున్నారు

By:  Tupaki Desk   |   30 July 2025 11:45 AM IST
ప్రధాని మోదీ పథకం.. ముద్ర పేరుతో భారీ దోపిడీ
X

మోసగాళ్లు తమ మాయలకు ప్రధాని, ముఖ్యమంత్రి వంటి నేతలనే ఎంచుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఫొటో, ఆయన మాటలను వక్రీకరించి ఆన్ లైన్ వేదికగా ఓ మోసగాడు భారీ దోపిడీ చేయాలని ప్రయత్నిస్తే ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘ముద్ర’ పథకం పేరును వాడేస్తూ మరో ఘరానా మోసగాడు తెలంగాణ సీఐడీకి చిక్కాడు. ‘ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ’ పేరుతో ఊరూరా బ్రాంచిలు తెరిచి ఉద్యోగాలు, డిపాజిట్ల పేరుతో దాదాపు రెండు వేల మందిని మోసం చేసిన తిప్పనేని రామదాసప్ప, ఆయన కుమారుడు సాయికిరణ్ ను తెలంగాణ పోలీసులు ఏపీ రాజధాని అమరావతిలో అరెస్టు చేశారు.

రెండు రాష్ట్రాల్లో 330 బ్రాంచులు

తెలంగాణ సీఐడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 330 బ్రాంచీలను తెరిచిన నిందితులు సుమారు 16 వందల మందిని ఉద్యోగులుగా నియమించి ప్రజల నుంచి సుమారు రూ.140 కోట్లు వసూలు చేశాడు. ముద్ర బ్యాంకుల్లో పనిచేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని ఉద్యోగుల నుంచి భారీగా వసూలు చేయడమే కాకుండా, అధిక వడ్డీలు చెల్లిస్తామని ఆశపెట్టి ప్రజల నుంచి కూడా భారీగా సొమ్ములు వసూలు చేశారు. అయితే డిపాజిట్లు తీసుకోవడమే కానీ, తిరిగి చెల్లించకపోవడం, అడిగితే వేధింపులకు దిగడంతో నిందితులపై బాధితులు సుమారు 10 ఫిర్యాదులు చేశారు.

రూ.140 కోట్ల మోసం

నిందితులు ఇద్దరు దాదాపు రూ.140 కోట్లు వసూలు చేయడమే కాకుండా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం కేసును సీఐడీకి బదిలీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన తెలంగాణ సీఐడీ అధికారులు మంగళవారం ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న సొసైటీ చైర్మన్ రామదాసప్పను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా, వారి సర్టిఫికెట్లు తీసుకుని ఇబ్బందులు పాల్జేసిన రామదాసప్పతోపాటు అతడి కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వీరి చేతిలో మోసపోయిన బాధితులు తమ డబ్బును తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.